- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దళిత ‘బంద్’.. వడ్ల వైపు అటెన్షన్ డైవర్షన్..
దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత దళితబంధు అమలు ప్రస్తావనే లేకుండా పోయింది. నవంబరు4 నుంచి ఈ పథకం ఉధృతంగా అమలవుతుందని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే చెప్పినా ఆ దిశగా అడుగులు పడలేదు. ఈసీ ఆంక్షలను అప్పట్లో తప్పుపట్టిన కేసీఆర్.. నవంబరు 4 తర్వాత ఈ పథకాన్ని ఆపడం ఎవరివల్లా కాదంటూ కుండ బద్దలు కొట్టారు. ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ నియోజకవర్గంలోని చింతగాని మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టినందున తానే అక్కడ పర్యటించి దళిత కుటుంబాలతో ముచ్చటిస్తానని చెప్పారు. దాదాపు నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ దాని ప్రస్తావనే లేకుండా పోయింది.
హుజూరాబాద్ నియోజకవర్గంలోని మొత్తం 22 వేల దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు మూడొంతుల మంది లబ్ధిదారులను గుర్తించి వారి బ్యాంకు ఖాతాల్లో తలా రూ. 10 లక్షల చొప్పున డిపాజిట్ కూడా చేసింది. లబ్ధిదారులు ఈ ఆర్థిక సాయంతో నిలదొక్కుకోడానికి వారి అవగాహన, అనుభవానికి తగినట్లుగా సంబంధిత శాఖల అధికారులతో కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి. కానీ ఆశించిన స్థాయిలో ఆ యూనిట్లు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. ఈ లోపు వడ్ల సమస్య ప్రధానాంశంగా తెరమీదకు రావడంతో అధికార పార్టీ నేతలంతా అందులో మునిగిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో అధికార యంత్రాంగం అందులో తలమునకలైంది. చింతగాని మండలంతో పాటు మరో మూడు మండలాలనూ దళితబంధు అమలు కోసం పైలట్ యూనిట్లుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. అక్కడ కూడా అడుగులు ముందుకు పడలేదు. హుజూరాబాద్ మొత్తం నియోజకవర్గం, పైలట్ ప్రాతిపదికన ఎంచుకున్న నాలుగు మండలాలతో పాటు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో వంద మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి తలా రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని, వచ్చే ఏడాది మార్చికల్లా ఇది పూర్తవుతుందని, రానున్న బడ్జెట్‌లో రూ. 20 వేల కోట్లను సెకండ్ ఫేజ్ కోసం కేటాయిస్తామని సీఎం తెలిపారు.
ప్రత్యేకంగా దళితబందు అమలు కోసం ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జాను సీఎంవో కార్యాలయంలో నియమిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. రానున్న ఏడేళ్ళలో రూ. 1.80 లక్షల కోట్లను ఈ పథకం కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికీ ఈ సాయం అందుతుందని, చివరి దశలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న దళితులకు కూడా వర్తింపజేస్తామని ప్రకటించారు. వివిధ శాఖల అధికారులతో, వేర్వేరు పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులతో, ప్రజా సంఘాలతో విస్తృతంగా సమావేశాలు కూడా నిర్వహించారు. అన్ని వైపుల నుంచి అభిప్రాయ సేకరణ కూడా జరిగింది. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ వరకు ఉన్న ఉధృతి ఫలితం వెలువడిన మరుసటి రోజు నుంచి కనిపించడం లేదని దళిత కుటుంబాలే వ్యాఖ్యానిస్తున్నాయి. కేవలం హుజూరాబాద్ ఎన్నికల కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు విపక్షాలు సీఎం కేసీఆర్‌పై ఆరోపణలు చేశాయి. అధికార పార్టీ నేతలు దీన్ని తమదైన శైలిలో తిప్పికొట్టాయి.
హుజూరాబాద్ ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరుకునే సమయానికే దళితబంధుపై ఆ నియోజకవర్గంలో చర్చలు మసకబారాయి. ఫలితం అధికార పార్టీకి ప్రతికూలంగా రావడంతో దాని గురించిన చర్చలు బొత్తిగా వినిపించడంలేదు. కరీంనగర్ జిల్లా అధికారులు సైతం దాని గురించి స్పందించడానికి సుముఖంగా లేరు. ఉప ఎన్నికకు ముందున్నంత వేడి లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు అనుమానించినట్లుగానే ప్రస్తుతానికి అది కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లిపోయింది. రాష్ట్ర రాజకీయాలన్నీ వడ్ల సమస్య చుట్టే తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశించినట్లుగా, ఆయన ప్లాన్ ప్రకారం వచ్చే ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వంద మందికి పథకం కింద లబ్ధి చేకూరుతుందా? అనే చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చి రైతులకు రానున్న యాసంగి సాగు ప్రణాళికపై వివరాలు ఇచ్చిన తర్వాత దళితబంధుపై ఫోకస్ పెడతారా? లేదా? అనే అభిప్రాయం అటు దళిత కుటుంబాల్లో, ఇటు అధికార యంత్రాంగంలో వ్యక్తమవుతున్నది.