రైళ్లకు ముందే కాళ్లొచ్చాయి…

by Sridhar Babu |
రైళ్లకు ముందే కాళ్లొచ్చాయి…
X

దిశ, కరీంనగర్: పొట్ట చేత పట్టుకుని ప్రాంతం కాని ప్రాంతంలో జీవనం సాగిస్తున్న వలస కూలీల పాలిట శాపంగా మారింది లాక్ డౌన్. పొద్దంతా కష్టపడి పనిచేస్తే తప్ప పట్టెడన్నెం దొరకని దయనీయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఆ కూలీలకు తిండి దొరికే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో తమ కడుపు నింపేందుకు తన కడుపులో పెట్టుకున్న బస్తీలను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. సొంత ఊర్లకు వెళ్దామంటే కనీసం వాహనాల రాకపోకలు కూడా లేకపోవడంతో ఆ కూలీలు తమ కాళ్లకు పని చెప్పారు. రోజులకొద్దీ నడుచుకుంటూ వెళ్లే దారుల్లో మానవత్వాన్ని పంచి బుక్కెడు బువ్వ ఎవరైనా అందిస్తే తినడం.. లేకుంటే తమ గమ్యం వైపు పయనమవడం అన్నట్టుగా సాగింది వారి నడక. మరో రెండు నుంచి నాలుగు గంటలు నడిస్తే చాలు సరిహద్దులు దాటుతామని కలలు కన్నారు వారంతా. కానీ, అనుకోకుండా ప్రభుత్వ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని ఉపశమన కేంద్రాలకు తరలించారు. దీంతో ఇంతదూరం వచ్చి మధ్యలోనే ఆగిపోయామన్న బాధ కొందరిదైతే… మరో గంట సేపు నడిస్తే తమ ఊర్లో చేరిపోయేవాళ్లమన్న బాధ మరికొందరిది. అయినా తప్పని పరిస్థితుల్లో పోలీసుల భయంతో వారంతా కూడా ఉపశమన కేంద్రాల్లో ఉంటూ కాలం వెళ్లదీశారు. తమ ఇళ్లకు చేరే సమయం ఆసన్నమైందన్న సంతోషంతో వారి ఆశలపై కేంద్రం నీళ్లు చల్లి మరోసారి లాక్ డౌన్ ను పెంచింది. దీంతో మనసంతా ఇంటి వైపు గుంజుతుంటే మనషులేమో సరిహద్దుల్లో యాంత్రిక జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో చెప్పా పెట్టకుండా ఉపశమన కేంద్రాల నుంచి తప్పించుకుని తమ ఊర్ల బాట పట్టారు.

ఒక్కరు కూడా లేరు..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్, కాళేశ్వరం ఉపశమన కేంద్రాల్లో దాదాపు 175 మంది వలస కార్మికులు ఆవాసం ఉండగా ఒక్కొక్కరుగా కేంద్రాల నుంచి తప్పించుకుని వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ రెండు కేంద్రాల్లోనూ వలస కార్మికులు ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. 40 రోజులకు పైగా అటు ఇంటికి చేరక, ఇటు పని చేసే చోట ఉండక త్రిశంఖు స్వర్గంలో ఉన్నట్టు ఉపశమన కేంద్రాల్లో ఉండిపోయారు. దీంతో తమ ఊర్లవైపు పయనం కావాలని నిర్ణయించుకున్న ఆ కూలీలు నెమ్మదిగా అర్థరాత్రి సమయంలో కేంద్రాల నుంచి పరారై మరీ వెల్లిపోయారు.

రైళ్లను ఏర్పాటు చేయకముందే..

ఇప్పుడు కేంద్రం వలస కూలీలను వారి సొంత ఊర్లకు పంపించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం అందించిన ఈ వెసులుబాటును వినియోగించుకునేందుకు తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఉపశమన కేంద్రాల్లో వలస కార్మికులూ ఎవరూ లేకపోవడం గమనార్హం. వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపించేందుకు రైళ్ల సౌకర్యం ఏర్పాటు చేయకముందే తమ కాళ్లకు పని చెప్పి తమ తమ గమ్య స్థానాలు చేరుకునేందుకు కూలీలు వెళ్లడం విశేషం. కేంద్రం రైళ్లను ఏర్పాటు చేయకముందే ఆ కూలీలు మాత్రం తమ కాళ్లతో గమ్య స్థానాలకు బయలుదేరారు.

Tags: Karimnagar, Migrant Workers, Destinations, Central Government, Police, State Government

Advertisement

Next Story

Most Viewed