డాక్టరేట్ అందుకున్న శునకం

by vinod kumar |
డాక్టరేట్ అందుకున్న శునకం
X

దిశ, వెబ్‌డెస్క్: డాక్టరేట్‌ను చాలా దేశాల్లో అతి పెద్ద డిగ్రీగా పరిగణిస్తారు. ఈ డిగ్రీ మధ్యయుగంలో ఉద్భవించింది. ఆ సమయంలో విశ్వవిద్యాలయాల్లో బోధించాలంటే డాక్టరేట్ తప్పనిసరి. అయితే చాలావరకు దేశీ, విదేశీ యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేస్తుంటాయి. వివిధ రంగాల్లో విశేషమైన కృషి చేసిన వారికి సాధారణంగా కాన్వోకేషన్‌లో డాక్టరేట్ ఇస్తుంటారు. కానీ, అమెరికాలోని వర్జీనియా టెక్ యూనివర్సిటీ మాత్రం.. ఓ శునకాన్ని గౌరవ డాక్టరేట్ డిగ్రీతో సత్కరించింది. ఏంటీ? శునకానికి డాక్టరేటా.. అని ఆశ్చర్యపోకండి.. మీరు విన్నది నిజమే.

వర్జీనియా టెక్ యూనివర్సిటీలో ఈ ఏడాది ఆన్‌లైన్‌లో డిగ్రీ పూర్తి చేసిన వారికి కాన్వోకేషన్ నిర్వహించింది. ఈ క్రమంలోనే ఎనిమిదేళ్ల ‘మూస్’ అనే శునకానికి కూడా వెటర్నరీ మెడిసిన్‌లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. యూనివర్సిటీకి చేసిన సేవలకు గుర్తింపుగా అధికారులు వెటర్నరీ సైన్స్‌లో మూస్‌కు గౌరవ్ డౌక్టరేట్ ఇచ్చారు. 2014 నుంచి క్యాంపస్‌లో మూస్ తన సేవలు అందిస్తోందని వారు తెలిపారు. ఇటీవలే మూస్ క్యాన్సర్ బారిన పడినట్టు వెల్లడైందని, ప్రస్తుతం దానికి కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ అందిస్తున్నామన్నారు. ఇంతటి అనారోగ్యంలోనూ మూస్ ఎంతో యాక్టివ్‌గా ఉండేదని వారు తెలిపారు. ఆరేళ్లుగా నిర్వహించిన 7500కు పైగా కౌన్సిలింగ్ సెషన్లలో మూస్ సేవలు అందించినట్టు వారు వెల్లడించారు. దీంతో ఇకపై ఈ శునకాన్ని పిలవాలంటే.. డాక్టర్ మూస్ అనాల్సిందే. గతంలోనూ మూస్ సేవలకు గుర్తింపు దక్కింది. వర్జీనియా వెటర్నరీ మెడికల్ అసోసియేషన్ 2019లో ‘యానిమల్ హీరో’గా మూస్‌ను ప్రకటించింది. రోజు మూస్ చేసే అవుట్‌స్టాండింగ్ సర్వీస్‌ను గుర్తించడంతో దాన్ని ‘హీరోయిక్ యానిమల్’గా సత్కరించడం విశేషం.

Advertisement

Next Story