మా అన్నను ఎలా చంపానంటే..?

by Sumithra |
మా అన్నను ఎలా చంపానంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆస్తి కోసం బంధాలను తెంచుకుంటున్నారు. రక్తం పంచుకోని పుట్టిన వారిని కూడా వదలడం లేదు. తోబుట్టువుల కంటే ఆస్తే ఎక్కువని ఇద్దరి అన్నదమ్ముల మధ్య ఉన్న భూవివాదం ఒకరి ప్రాణాలను తీసింది. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు స్థానికుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి.

నూతనకల్ మండల కేంద్రానికి చెందిన బిక్కి ఉప్పలయ్య (40) కల్లు గీత కార్మికుడు. గీత వృతితోపాటు తనకున్న భూమిలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఉప్పలయ్యకు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. వీరిలో రెండో సోదరుడు వెంకన్నకు, ఉప్పలయ్యకు మధ్య గత కొంతకాలంగా భూ వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉప్పలయ్య శనివారం గెట్ల మధ్యలో ఉన్న చెట్లను నరికాడు. చెట్లను నరకొద్దని తమ్ముడు హెచ్చరించినా అన్న పట్టించుకోకుండా వాటిని తొలగించాడు.

తన అన్న ఉన్నన్ని రోజులు తనకు గెట్టు పంచాయితీ తప్పదని, అతడిని అడ్డు తొలగిస్తేనే సమస్యకు పరిష్కారమని భావించాడు. ఆదివారం ఉదయం ఉప్పలయ్య యధామాదిరిగా తాటిచెట్లను గీయడానికి వెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న ఆయన సోదరుడు వెంకన్న.. ఉప్పలయ్యను గొడ్డలితో నరికేశాడు. తల, మెడ మీద బలమైన వేటు వేయడంతో ఉప్పలయ్య అక్కడికక్కడే హతమయ్యాడు. సమాచారం అందుకున్న సీఐ రవి, ఎస్ఐ శివకుమార్ సంఘటన స్థలానికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేశారు. మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఏరియా హాస్పిటల్ కి తరలించారు.

అయితే ఈ కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న బిక్కి వెంకన్నహత్య అనంతరం నూతనకల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. తన అన్న ఉప్పలయ్యను తానే హత్య చేసినట్లు పోలీసులకు వివరించాడు. తనతో తెచ్చిన గొడ్డలిని సైతం పోలీసులకు అప్పగించి, నేరం ఒప్పుకున్నట్లు సమాచారం.

Advertisement

Next Story