డాక్టర్ నిర్వాకం : చనిపోయిన యువకుడిని HYD పంపించే ప్రయత్నం.. చివరికి

by Aamani |   ( Updated:2021-12-17 01:54:39.0  )
డాక్టర్ నిర్వాకం : చనిపోయిన యువకుడిని HYD పంపించే ప్రయత్నం.. చివరికి
X

దిశ, కామారెడ్డి : ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుని నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైంది. కామారెడ్డి పట్టణంలోని లైఫ్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్వాయి మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన జమ్మని మోహన్‌కు రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతన్ని మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని లైఫ్ ఆస్పత్రికి తరలించారు. మరొక వ్యక్తిని హైదరాబాద్ తరలించారు. రాత్రి లైఫ్ ఆస్పత్రికి వచ్చే సమయానికి కుటుంబ సభ్యుల వద్ద డబ్బులు లేకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది గంటన్నర పాటు గాయపడిన మోహన్ ను అంబులెన్సులోనే ఉంచారని కుటుంబ సభ్యులు తెలిపారు.

డబ్బులు కట్టిన తర్వాత స్కానింగ్ కోసం పంపించారని, తిరిగి వచ్చాక ఆస్పత్రి వైద్యుడు కాకుండా ఆస్పత్రిలో పని చేసే సిబ్బంది మోహన్‌కు చికిత్సలు చేశారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆస్పత్రి పైనే వైద్యుడు ఉన్నా రాలేదని ఆరోపించారు. తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల ప్రాంతంలోనే మోహన్ కడుపునొప్పితో బాధపడుతూ మృతి చెందాడని, అయినా వైద్యులు తమకు చనిపోయినట్టుగా చెప్పకుండా అంబులెన్స్ తెప్పించి హైదరాబాద్ పంపించే ప్రయత్నం చేసారని తెలిపారు. మోహన్ మృతికి వైద్యుని నిర్లక్ష్యమే కారణమని, డాక్టర్ తో పాటు ఆస్పత్రిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మోహన్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడినుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. ఆస్పత్రి వద్దకు పోలీసులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Advertisement

Next Story

Most Viewed