ప్రశ్నించే పాత్రికేయులపై దాడులు చేయడం దుర్మార్గం

by Shyam |
TWJF
X

దిశ, తుంగతుర్తి: తుంగతుర్తి నియోజకవర్గ జర్నలిస్టుల సమావేశం శుక్రవారం తిరుమలగిరి మండల కేంద్రంలో జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి దయనీయంగా మారిందని, పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టుల భద్రత హక్కులు, ప్రశ్నార్థకమయ్యాయని అన్నారు. ఒకవైపు ప్రభుత్వం, యాజమాన్యాల నిర్లక్ష్యం, మరోవైపు దాడులు, దౌర్జన్యాలతో భద్రతలేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

జర్నలిస్టులు రాబోయే రోజుల్లో అప్రమత్తంగా వుంటూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లాలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ తిరుగులేని యూనియన్‌గా జర్నలిస్టులకు అండగా వుండాలని మామిడి సోమయ్య అన్నారు. జిల్లా కమిటీతో పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫెడరేషన్ కమిటీలు ఎన్నిక జరగాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ నాయకులు చొల్లేటి రమణ, ఎండీ రెహమాన్ అలీ, సీనియర్ జర్నలిస్టు చొల్లేటి రాములు, ఎండీ ఖలీల్, ఉపేంద్ర చారి, టీ.మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story