దుబ్బాకలో అనూహ్య చర్చలు..

by Anukaran |
దుబ్బాకలో అనూహ్య చర్చలు..
X

దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక అసెంబ్లీకి ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో ప్రజల మధ్యలో ఊహకు అందని విధంగా ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. మల్లన్నసాగర్‌లో ఇంతకాలం సాగుచేసుకుంటున్న భూములు ముంపు పేరుతో ఊడిపోయాయే తప్ప దళితులకు మూడెకరాల భూమి మాటలకు మాత్రమే పరిమితమైందనేది, బీసీల సంక్షేమానికి ఆరేండ్లలో చేసిందేమీ లేదనేది వారి చర్చల్లోని సారం. అభివృద్ధి చేశామంటూ అధికార పార్టీ నేతలు ప్రచారం చేస్తున్న సమయంలో సాధారణ సంక్షేమాన్ని కూడా సర్కారు మరిచిందని విపక్షాలు మొత్తుకుంటున్నాయి. ఇంతకూ ఈ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమం కోసం టీఆర్ఎస్ ఇచ్చిన హామీలేంటి, అమలైంది ఎంతవరకు అనేది పరిశీలిద్దాం.

ప్రతీ గ్రామానికి దోబీఘాట్..

టీఆర్ఎస్ పార్టీ 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రూపొందించిన మేనిఫెస్టోలో ప్రతీ గ్రామానికి దోబీఘాట్‌ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు హామీ (పేజీ నెం. 18, తెలుగు) ఇచ్చింది. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 146 గ్రామాలు ఉన్నట్లు అంచనా. సిద్దిపేట జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఇచ్చిన సమాచారం మేరకు నియోజకవర్గంలో మూడు మండలాల్లో కలిపి కేవలం 11 దోబీఘాట్‌లు మాత్రమే ఉన్నట్లు తేలింది. ఇందులో దుబ్బాక మండలంలో చీకోడు, కమ్మరిపల్లి, హబ్సీపూర్, ధర్మాజీపేట, గోసంపల్లి, తొగుట, మిర్దొడ్డి మండలంలో అందె, చిట్యాల, మిర్దొడ్డి, దౌల్తాబాద్ మండలంలో దౌల్తాబాద్, గొడుగుపల్లి గ్రామాల్లో మాత్రమే దోబీఘాట్‌లు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఇంకెక్కడా దోబీఘాట్‌ల నిర్మాణం జరగలేదు.

సబ్సిడీ సున్నా..

మండల స్థాయిలో ఆర్టిజన్ కాంప్లెక్స్ నిర్మాణం సత్వరం చేపట్టనున్నట్లు టీఆర్ఎస్ 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ (పేజీ-17, తెలుగు) ఇచ్చింది. కానీ, నియోజకవర్గంలో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ మండలంలో కూడా ఒక్క ఆర్టిజన్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టలేదని జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఈ పథకం కోసం సర్కారు నుంచి ఎలాంటి నిధులు రాలేదని వివరించారు. దీనికి తోడు నాయీ బ్రాహ్మణులు సెలూన్‌లు ఏర్పాటు చేసుకున్నట్లయితే అందులో అవసరమయ్యే పరికరాల కొనుగోలుకు సబ్సిడీ ఇవ్వనున్నట్లు హామీ (పేజీ-18, తెలుగు) ఇచ్చింది. కానీ, సెలూన్ పరికరాల కోసం, భాజా భజంత్రీల బృందాలు, బ్యాండ్ మేళం వాయిద్యాలు కొనుగోలు చేసినవారికి సబ్సిడీ రూపంలో ఒక్క పైసా కూడా విడుదల కాలేదని ఆ అధికారి పేర్కొన్నారు.

714 మందికి రూ.8.28 కోట్లు..

వెనకబడిన తరగతుల సంక్షేమం కోసం ఈ నియోజకవర్గంలో వివిధ పథకాల కింద గడచిన ఆరున్నరేండ్లలో సుమారు 8.28 కోట్ల మేర సర్కారు నుంచి ఆర్థిక సాయం అందింది. కానీ, దీనివలన కేవలం 716 మంది మాత్రమే లబ్ధి పొందారు. మూడేండ్ల పాటు ఒక్క పైసా కూడా ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు. అసలు ఈ మూడేండ్లకు ‘యాక్షన్ ప్లాన్’ కూడా విడుదల కాలేదు. 2014-15లో రూ. 96 లక్షల మేర విడుదల చేయడంతో 184 మందికి, 2015-16లో 373 మందికి రూ. 6.53 కోట్లు, 2017-18లో 159 మందికి రూ. 79.50 లక్షల మేర ప్రభుత్వం సాయం అందించింది. 2016-17, 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల్లో ఈ నియోజకవర్గానికి వెనకబడిన తరగతుల సంక్షేమం కోసం యాక్షన్ ప్లాన్ కూడా రూపొందలేదు.

ఒక్క లబ్ధిదారుడు లేడు..

సాగుభూమి లేని దళితులకు ప్రభుత్వమే ఉచితంగా మూడు ఎకరాల మేర భూమిని సమకూర్చనున్నట్లు టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకాన్ని కొన్నిచోట్ల అమలుచేసింది. కానీ, చాలా స్వల్ప స్థాయిలోనే అమలైంది. నియోజకవర్గంలోని రాయపోలు మండలంలో 2014 జూన్ మొదలు ఇప్పటివరకు ఒక్క లబ్ధిదారుని పేరును కూడా ఖరారు చేయలేదని, ఒక్క ఎకరం భూమిని కూడా ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించడం లేదా కొనుగోలు చేయలేదని తహసీల్దారు కార్యాలయం స్పష్టం చేసింది. ఈ నియోజకవర్గంలో మిగిలిన గ్రామాల్లోని పరిస్థితి కూడా టీఆర్ఎస్ హామీ ఇచ్చిన స్థాయిలో అమలు కాలేదు. ప్రభుత్వం నుంచి కొత్తగా మూడెకరాల భూమి సంగతేమోగానీ ఉన్న భూమి కూడా మల్లన్నసాగర్ ముంపు పేరుతో చేజారిపోయిందని అక్కడి గ్రామస్తులు మొత్తుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed