ఖమ్మం జిల్లాకు హైటెక్ హంగులు..

by Sridhar Babu |   ( Updated:2021-04-01 01:12:17.0  )
ఖమ్మం జిల్లాకు హైటెక్ హంగులు..
X

దిశ, ఖమ్మం: ఖమ్మం పట్టణం రోజురోజుకూ అభివృద్ధి బాట పడుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో కనిపించే నగరం అంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఖమ్మం సిగలో మరో కలికితురాయి ఏర్పాటు కాబోతోంది. రాష్ట్రంలోనే అత్యంత హంగులతో ఏర్పాటు చేసిన హైటెక్ బస్టాండ్ ను రేపు మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి ఓపెనింగ్ చేయనున్నారు. అంతేకాదు మొత్తం సుమారు రూ. 423కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగా ప్రారంభించనున్న హైటెక్ బస్టాండ్ నిజంగా ఖమ్మం నగరానికి మేరు నగ కానుంది.

సుమారు ఏడున్నర ఎకరాల్లో నిర్మాణం చేపట్టిన బస్టాండ్లో 30 ప్లాట్ ఫాంలు.. ఏకంగా 1250 బస్సులు, 40 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే విధంగా నిర్మాణం చేపట్టారు. అంతేకాదు విశాలమైన సెల్లార్, షాపింగ్ కాంప్లెక్స్లు, మినీ సినిమా థియేటర్, ఫుడ్ కోర్టులు సైతం ఏర్పాటు కానున్నాయి. ఆధునిక హంగులతో ఏర్పాటు చేసిన ఈ బస్టాండ్ నిర్మాణానికి ప్రభుత్వం ఏకంగా రూ. 25 కోట్లు కేటాయించింది.

ఇక నగరం నడిబొడ్డున గల వైకుంఠధామాన్ని చూడడానికి ఎంతో ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. ఒకప్పుడు అటువైపు చూడాలంటేనే భయపడే నగర ప్రజలు, ఇప్పుడు అటువైపుగా వెళ్తుంటే చూడలేకుండా ఉండలేకపోతున్నారు. అంతేకాదు.. విశాలమైన పార్కును తలపించేలా ఉన్న ఈ శ్మశాన వాటికలో 20 అడుగుల శివుని విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాగా ఈ వైకుంఠధామానికి ప్రభుత్వం రూ. 75 లక్షలు కేటాయించింది. అంతేకాదు రాష్ట్రంలో జిల్లాలోనే మొదటి సారిగా ఏర్పాటు కానున్న ఐటీ హబ్ రెండో దశకు నిర్మాణ పనులకు రూ. 36కోట్లతో శంకుస్థాపన చేయనున్నారు. ఇక సుమారు రూ. 60కోట్లతో టేకులపల్లిలో నిర్మించిన 1000 డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయాలను కూడా ప్రారంభించనున్నారు. వీటితోపాటు.. ఇంకా వందల కోట్లతో అభివృద్ధి పనులను మంత్రులు రేపు ప్రారంభించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed