ఎన్నో ఆశలతో కొత్త ఉద్యోగం.. మృత్యువుతో పోరాడుతూ టీచర్ మృతి

by srinivas |   ( Updated:2021-06-28 01:12:44.0  )
ఎన్నో ఆశలతో కొత్త ఉద్యోగం.. మృత్యువుతో పోరాడుతూ టీచర్ మృతి
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడు. తమకు ఇక లోటేం ఉండదని తెగ మురిసిపోయాడు. ఎన్నో ఆశలతో కొత్త ఉద్యోగంలో చేరాడు. తొలినెల జీతం అందుకోలేదు. రెండో నెలలో వస్తుందని వేచి చూశాడు. అప్పుడు కూడా రాలేదు. అలా 9నెలలు గడిచినా ఒక్క నెల జీతం కూడా రాలేదు. ఇంతలో దురదృష్టవశాత్తు ఆ ఉపాధ్యాయుడు అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలయ్యాడు. మృత్యువుతో పోరాడుతున్నా… వేతనం ఇప్పించండి అంటూ ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా కనికరించలేదు. చివరికి ఆరోగ్యం విషమించి ఓ ఉపాధ్యాయుడు కన్నుమూశాడు. ఈ దయనీయ ఘటన విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలం గడుగుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే కిరసాని విశ్వనాథం(27) డీఎస్సీలో ఎంపికయ్యారు. గతేడాది సెప్టెంబరులో సీలేరు గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఎస్‌జీటీగా విధుల్లో చేరారు. ఆయనకు సీఎఫ్‌ఎంఎస్‌ ఐడీ క్రియేట్‌ కాకపోవడంతో జీతం రావడం లేదు. పలుమార్లు అధికారులు, డీడీవోను కలిసినా ఫలితం లేకపోయింది. జూన్ మెుదటి వారంలో విశ్వనాథం గొంతు నొప్పితో కేజీహెచ్‌లో చేరారు. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాలంటే చేతిలో చిల్లిగవ్వకూడా లేని పరిస్థితి. ఈ విషయం తెలుసుకున్న పాడేరు గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయ్‌కుమార్‌ 3రోజుల్లో వేతన బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినా అవి బుట్టదాఖలయ్యాయి. ఒక్క నెల జీతం కూడా ఇవ్వలేదు. పరిస్థితి విషమంగా మారడంతో కేజీహెచ్‌లో టీచర్ విశ్వనాథంకు వారం క్రితం గొంతు శస్త్రచికిత్స జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి శనివారం కన్నుమూశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే విశ్వనాథం మృతిచెందారని కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కుడుముల కాంతారావు, కుడుమల వెంకటరమణ ఆరోపించారు. చనిపోయిన తర్వాత వచ్చి ఏం లాభమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story