భారత ఎంబసీలో సోదాలు చేసిన తాలిబన్లు

by Shamantha N |
భారత ఎంబసీలో సోదాలు చేసిన తాలిబన్లు
X

కాబూల్: తాలిబన్లు భారత్ ఖాళీ చేసిన ఎంబసీలలో సోదాలు చేసినట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. తమ ఆధీనంలో ఉన్న కాందహర్, హెరాత్ సహ జలాలబాద్ ప్రాంతాలలో ఉన్న కాన్సులేట్ జనరల్‌లో కీలక పత్రాల కోసం అన్వేషించినట్లు కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. అయితే ఇక్కడ నుంచి ఎలాంటి పత్రాలు లభించకపోవటంతో అక్కడ నిలిపి ఉంచిన వాహనాలను తీసుకెళ్లినట్లు సమాచారం. తాలిబన్లు మొదట కాబూల్‌లో ప్రవేశించినప్పుడు విదేశీ రాయబార కార్యాలయాలపై ఎటువంటి దాడి చేయమని హమీ ఇచ్చారు. అంతేకాకుండా మీ ఆస్థులు, వాహనాలు కూడా తాకబోమని చెప్పారు. కానీ తాజాగా తమ ప్రకటనలకు విరుద్దంగా తాలిబన్లు వ్యవహరించారు. అప్ఘాన్‌లోని కాబూల్, మజారీ ఈ షరీఫ్, కాందహర్, హెరాత్ లలో ప్రాంతీయ కాన్సులేట్ జనరల్ కార్యాలయాలను భారత్ నిర్వహించింది.

అయితే పరిస్థితులు అదుపు తప్పటంతో వాటిని ఎప్పుడో ఖాళీ చేసింది. కాబూల్ కేంద్రంగా రాయబార కార్యాలయాన్ని మాత్రమే నడిపిన దానికి సైతం మూసివేసింది. చివరగా మంగళవారం 120 మందితో కూడిన దౌత్య సిబ్బందిని న్యూఢిల్లీకి తరలించిన భారత్ రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. ఈ పరిణామం గురించి బయటపడిన కాసేపటికే మరో ఆసక్తికరం విషయం వెల్లడైంది. భారత రాయబార కార్యాలయాన్ని తరలించడానికి ప్రయత్నం జరుగుతున్న తరుణంలో తాలిబన్లు, ఖతార్‌ నుంచి భారత విదేశాంగశాఖకు సమాచారం అందించారు. మేము ఇండియా పౌరుల జోలికి వెళ్లబోమని, వారి భద్రతకు పూర్తి భరోసా ఇస్తామని హమీ ఇచ్చారని తెలిసింది. ఈ సమాచారం తాలిబన్ రాజకీయ వ్యవహరాల నేత అబ్బాస్ స్టాన్‌కజ్జాయ్ నుంచి వచ్చిందని తెలిసింది. గతవారం భారత్ తన సిబ్బందిని తరలించడానికి రెండు సీ-17 గ్లోబ్ మాస్టర్‌లను తరలించింది. వాటిలో మన సిబ్బందితో పాటు అప్ఘాన్ రాయబారులను న్యూఢిల్లీకి తరలించింది. అయినప్పటికి 1000 మంది భారతీయులు ఇంకా అప్ఘాన్‌లో వివిధ ప్రాంతాలలో చిక్కుకుని ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed