హరితహారంలో అధికారుల విచిత్ర తీరు.. అవాక్కవుతున్న ప్రజలు

by Shyam |   ( Updated:2021-08-17 21:51:42.0  )
Trees
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఆరు విడతల్లో 210.85 కోట్లు మొక్కలు నాటారు. ఈ ఏడాది ఏడో విడత హరితహారంలో 19.91 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. అందులో భాగంగా ప్రతి ఏడాది ఆయా శాఖలవారీగా మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టింది. అదే నేడు హరితహారాన్ని అభాసుపాలు చేస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేసేందుకు ఆయా శాఖలు ఇష్టారీతిన మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని అపహాస్యం చేస్తున్నారు.

హైదరాబాద్ కార్మిక శాఖ ప్రధాన కార్యాలయంలో భారీ వృక్షాల కిందే అధికారులు దాదాపు 1500 మొక్కలు నాటారు. ప్రభుత్వం శాఖలకు మొక్కలు నాటాలని టార్గెట్ విధించడంతో దాన్ని పూర్తి చేసేందుకు మొక్కుబడిగా సిబ్బంది భారీ వృక్షాల కిందే మొక్కలు నాటుతున్నారు. నిజానికి మొక్కకు సరైన మోతాదులో సూర్యరశ్మి అందకుంటే ఆ మొక్క కనీసం ఎదగక పోగా అసలు బతికే అవకాశం కూడా ఉండదు. టార్గెట్‌ను పూర్తి చేసేందుకు మొక్కలు ఎలా పడితే అలా నాటడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. వృక్షాల కింద మొక్కలు కనీసం ఎదగలేవనే విషయం కూడా అధికారులకు తెలియదా అంటూ ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు.

Greenery

లేబర్ కార్యాలయంలో నాటిన మొక్కలను సంరక్షించడంలో అధికారులు ఫెయిలయ్యారు. నాటిన మొక్కల్లో కొన్ని ఇప్పటికే వంగి విరిగిపోగా.. మరికొన్ని ఎండిపోయాయి. ఇదిలా ఉంటే భారీ వృక్షాన్ని తొలగించి మరీ అధికారులు వృక్షాల కింద మొక్కలు నాటడం హరితహారం కార్యక్రమాన్ని నీరుగార్చినట్లయింది. అధికారులు మొక్కలు సంరక్షించాలని ప్రజలకు చెప్పడం వరకేనా.. వారు పాటించేది ఉండదా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా ఇష్టారాజ్యంగా మొక్కలు నాటిన విషయంపై అధికారులను ఆరా తీయగా కార్యాలయం ఆవరణలో ఖాళీస్థలం ఉందని మొక్కలు నాటినట్లు చెప్పడం గమనార్హం.

మొక్క నాటేందుకు ప్రభుత్వం నిర్దిష్ట ప్రామాణికతను రూపొందించింది. దాని ప్రకారం మొక్కకు మొక్కకు మధ్య నిర్ణీత దూరం పాటించాల్సి ఉంటుంది. కనీసం దూరం లేకుండా లేబర్ కార్యాలయంలో మొక్కలు నాటడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. భారీ వృక్షాల కింద మొక్కలు నాటడానికి తోడు కనీసం దూరం ఉండాలనే నిబంధనలు కూడా పట్టించుకోకుండా అధికారులు మొక్కలెలా నాటుతారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో మొక్క నాటేందుకు, వాటి సంరక్షణకు కొంత మొత్తాన్ని వెచ్చిస్తోంది. అధికారుల తీరుతో అటు ప్రభుత్వ లక్ష్యం దెబ్బతినడమే కాక, ఇటు ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నాయనే విమర్శలు కార్మికశాఖపై వస్తున్నాయి.

Harithaharam

అయితే ఈ అంశం ఒక్క కార్మిక శాఖకే పరిమితం కాలేదు. అన్ని శాఖలదీ ఇదే తీరుగా ఉంది. ఇటీవల రోడ్డుపైనే మొక్కలు నాటేందుకు రోడ్డును, ఫుట్ పాత్ ను సైతం ధ్వంసం చేసిన దాఖలాలున్నాయి. అంతేకాకుండా విద్యుత్ స్తంభాల కిందే మొక్కలు నాటుతున్న పరిస్థితి దాపురించింది. దీనివల్ల భవిష్యత్ లో ఇబ్బందులు తలెత్తితే వృక్షాన్ని తొలగించాల్సి వస్తుంది. అంత మాత్రానికి హరితహారం చేయడమెందుకు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Advertisement

Next Story