తెలంగాణ రాష్ట్రమేమైనా కల్వకుంట్ల ఎస్టేటా..!

by Sridhar Babu |   ( Updated:2021-07-27 21:42:18.0  )
GDk
X

దిశ, గోదావరిఖని : తెలంగాణ రాష్ట్రం ఏమైనా కల్వకుంట్ల ఎస్టేటా అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు. మంగళవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి, సీనియర్ నాయకులు సుతారి లక్ష్మణ్ బాబులు మాట్లాడుతూ.. కేటీఆర్ జన్మదినం సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో చేపట్టిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమానికి హాజరైన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ రావు కోసం ప్రోటో కాల్‌కు విరుద్ధంగా అధికారులు వ్యవహరించారని మండిపడ్డారు.

రాజ్యసభ సభ్యుడి కోసం సింగరేణిలో ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడి అధికారులు అధికార దుర్వినియోగం చేశారని అన్నారు. సీఎం కుమారుడు కేటీఆర్‌కు, సంతోష్ రావుకు మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని విమర్శించారు. ఓ కేబినెట్ మంత్రి వస్తే ఆయన కార్యక్రమంలో పాల్గొనని రామగుండం సీపీ.. రాజ్యసభ మెంబెర్ వస్తే ప్రోటోకాల్ విస్మరిస్తూ ఎలా పాల్గొంటారని వారు ప్రశ్నించారు. ప్రభుత్వ నిధులను తీసుకొని ముక్కోటి వృక్షార్చన ఎలా చేస్తారని విమర్శించారు.

నిజామాబాద్, మహబూబాబాద్‌లో 2 గంటలు ఎండలో మహిళలను నిలబెట్టారని పేర్కొన్నారు. అలాగే ఎంపీ జోగినిపల్లి సంతోష్ రావు స్వగ్రామం నిలోచపల్లి గ్రామంలో ఎంపీ కోసం 8 మంది రైతులను నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్, అనుబంధ సంఘాల నేతలు సుతారి లక్ష్మన్ బాబు, తిప్పారపు శ్రీనివాస్, విరబోయిన రవి యాదవ్, ఉట్ల కిరణ్, వాజిద్ ఖాన్, పంజా శ్రీనివాస్, చందా చంద్రమోహన్, ఎంచర్ల మహేష్, ఎండీ రహీం, గడ్డం సతీష్, మాటేటి సతీష్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed