సీరంలో స్పుత్నిక్ వీ ఉత్పత్తి!

by Shamantha N |
Russia, Sputnik V
X

ముంబై: రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ టీకాను ఉత్పత్తి చేయాలనుకుంటున్న సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరో అడుగు ముందుకేసింది. పరీక్షలు, విశ్లేషణల కోసం స్పుత్నిక్ వీ టీకాను ఉత్పత్తి చేసుకోవడానికి సీరం సంస్థకు భారత డ్రగ్స్ రెగ్యులేటరీ డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. స్పుత్నిక్ వీ టీకా ఉత్పత్తి చేయడానికి రష్యాకు చెందిన గమలేయ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమియలజీ, మైక్రోబయాలజీ సంస్థతో సీరం సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో స్పుత్నిక్ వీ టీకా ఉత్పత్తికి అనుమతించాల్సిందిగా గురువారం డీసీజీఐకి సీరం దరఖాస్తు చేసుకుంది. తాజాగా, లైసెన్స్ పొందిన హదాప్సర్ ఫెసిలిటీ యూనిట్‌లో స్పుత్నిక్ వీ టీకాను పరీక్షలు, విశ్లేషణల కోసం ఉత్పత్తికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చిందని అధికారవర్గాలు వెల్లడించాయి.

డీసీజీఐ విధించిన నాలుగు షరతులు ఇలా ఉన్నాయి.. గమేలియా నుంచి సెల్ బ్యాంక్, వైరస్ స్టాక్‌ను బదిలీ చేసుకోవడానికి గమలేయాతో కుదిరిన ఒప్పంద పత్రాన్ని డీసీజీఐకి సీరం సమర్పించాలి. టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌ కాపీని అందజేయాలి. సెల్ బ్యాంక్, వైరస్ స్టాక్‌ను దిగుమతి చేసుకోవడానికి రివ్యూ కమిటీ ఆన్ జెనెటిక్ మానిపులేషన్(ఆర్‌సీజీఎం) అనుమతి పత్రాన్ని సమర్పించాలి. వైరల్ వెక్టార్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ టీకాపై పరిశోధన, అభివృద్ధికీ ఆర్‌సీజీఎం అనుమతి కాపీని డీసీజీఐకి అందించాలి. ఆర్‌సీజీఎం నుంచి అనుమతుల కోసం సీరం గతనెల 18నే దరఖాస్తు పెట్టుకున్నది. సీరం అప్లికేషన్‌పై పలు సందేహాలు లేవనెత్తుతూ గమలేయా నుంచి మెటీరియల్ ట్రాన్స్‌ఫర్‌కు కుదిరిన అగ్రిమెంట్ కాపీని సమర్పించాల్సిందిగా కోరినట్టు సమాచారం.

Advertisement

Next Story