ముగ్గురు ఎమ్మెల్సీలకు గవర్నర్ ఓకే

by Anukaran |
ముగ్గురు ఎమ్మెల్సీలకు గవర్నర్ ఓకే
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం మేరకు రాజ్‌భవన్‌కు ప్రభుత్వం పంపిన ముగ్గురు పేర్లను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆదివారం ఆమోదం తెలిపారు. గవర్నర్ కోటా కింద శాసనమండలికి పంపే ముగ్గురి పేర్లతో కూడిన నోటిఫికేషన్‌ను గవర్నర్ ఆదివారం జారీ చేశారు. ఆరేళ్ళపాటు ఈ ముగ్గురూ ఎమ్మెల్సీలుగా కొనసాగుతారని ఆ నోటిఫికేషన్‌లో గవర్నర్ పేర్కొన్నారు. గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్ నోటిఫికేషన్ వెలువడిన అనంతరం ఆరేళ్ళపాటు ఎమ్మెల్సీలుగా కొనసాగనున్నట్లు గవర్నర్ పేర్కొనడంతో త్వరలో వీరు శాసనమండలి ఛైర్మన్ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటివరకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న రాములునాయక్ పదవీ కాలం మార్చి 2న ముగిసిపోగా, నాయిని నర్సింహారెడ్డి పదవీకాలం జూన్ 19న ముగిసింది. కర్నె ప్రభాకర్ పదవీకాలం ఆగస్టు 17న ముగిసింది. వీరి స్థానంలోనే ముగ్గురు కొత్త సభ్యుల పేర్లను ప్రభుత్వం పంపిన తర్వాత గవర్నర్ ఆమోదుముద్ర వేశారు.

Advertisement

Next Story