- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదిలోనే ఆటంకం.. ఆ ప్రాజెక్టు మోటార్ల మొరాయింపు
దిశ, మెదక్ : కోటి ఆశలు, వేల కోట్ల ఖర్చు ఫలితం గంటలోనే తుస్సుమంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందుతుందన్న లక్ష్యం ఆదిలోనే నీరు గారుతోన్నది. ఆగమేఘాల మీద హడావిడిగా ప్రారంభించిన రంగనాయక సాగర్ మోటార్లు ఆదిలోనే ఆటంకం కలిగిస్తున్నాయి. విషయం ఏంటని అడిగితే టెక్నికల్ సమస్య అని అధికారులు చెబుతుంటే… కాదు.. కాదు.. ప్రాజెక్ట్ లో ముంపునకు గురవుతున్న ఎల్లమ్మ తల్లి ఆగ్రహించిందని గ్రామస్తులు అంటున్నారు.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చంద్లాపూర్ గ్రామ శివారులో 3 టీఎంసీ సామర్థ్యంతో నిర్మించిన రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ఈ నెల 24 న రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ లు ప్రారంభించిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా మేడిగడ్డ నుంచి గోదావరి జలాలను 170 కిలోమీటర్ల మేరకు అండర్ గ్రౌండ్ టన్నెల్ పంపింగ్ ద్వారా మిడ్ మానేరు, అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ లను నింపే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే మిడ్ మానేరు జలాశయం, అనంతగిరిసాగర్, రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ల నిర్మాణాలు పూర్తి చేశారు. ఇంకా మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ దశలో ఉంది. నిర్మాణం పూర్తయిన మిడ్ మానేరు జలాశయానికి గోదావరి జలాలు చేరుకున్నాయి. అక్కడి నుంచి అనంతగిరి రిజర్వాయర్ కు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంపింగ్ చేశారు. అటు నుంచి రంగనాయక సాగర్ సర్జిపూల్ లో ఏర్పాటు చేసిన నాలుగు పంపుల ద్వారా రంగనాయక సాగర్ లో ఎత్తిపోయాల్సి ఉంటుంది. ఇందుకోసం సర్వం సిద్ధం చేసి అధికారికంగా మంత్రులు హరీశ్ రావు, కేటిఆర్ లు 4 మోటార్లలో ఒక మోటార్ ను ఈ నెల 24 న మ. 12 గంటల సమయంలో స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. అదేరోజు సుమారు గంట సేపు నడిపిన పంపును అధికారులు ఆపివేశారు. ప్రాజెక్ట్ లో గోదావరి జలాలు చేరుకుంటున్నాయన్న సమాచారంతో ప్రజలు భారీ సంఖ్యలో రంగనాయక సాగర్ జలాశయం చూడటానికి వస్తున్నారు. అయితే ప్రజలు పెద్ద ఎత్తున రావటంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని మోటార్లను ఆపివేశారని అధికారులు చెప్పుతున్నా ఇది నిజంకాదని.. అసలు విషయం ప్రాజెక్ట్ లో ముంపునకు గురవుతున్న ఎల్లమ్మ తల్లి అడ్డంకులు సృష్టిస్తోందని స్థానిక ప్రజలు స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ముంపునకు గురవుతున్న దేవాలయంలోని ఎల్లమ్మ దేవి విగ్రహం కళ్లలోనుంచి నీళ్ళు కారటం, అప్పుడు శాంతిపుజలు, ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాజెక్ట్ పక్కనే దేవాలయం నిర్మిస్తామని మొక్కులు చెల్లించి ప్రాజెక్ట్ పక్కనే ఎల్లమ్మ దేవాలయం నిర్మాణం ప్రారంభించారు.
ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభించుకోవటం జరిగింది. కానీ, దేవాలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఇంకా పూర్తి కాలేదు. ప్రాజెక్ట్ ప్రారంభించుకున్న మరుసటి రోజు నడిపిన 15 నిమిషాల వ్యవధిలోనే మళ్ళీ మోటార్లను ఆపివేశారు. ఇలా ప్రారంభించిన రోజు నుంచి ప్రతి రోజూ 15 నుంచి 30 నిమిషాల వ్యవధి కంటే ఎక్కువ నడిపించడం లేదు. బుధవారం రోజు కూడా 16 నిమిషాలు మాత్రమే నడిపించారు. దీనిపై సంబంధిత ప్రాజెక్ట్ అధికారులను వివరణ కోరగా మోటార్లలో చిన్న సాంకేతిక సమస్య తలెత్తిందని చెబుతున్నారు. మరికొందరు అధికారులు ప్రారంభించిన కొద్దీ సేపటికే మోటార్లు వేడెక్కి లోడ్ ఎక్కువై విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని చెబుతున్నారు. మరోవైపు చంద్లాపూర్ గ్రామస్తులు మాత్రం మా గ్రామ దేవత ఎల్లమ్మ ఆలయం ప్రాజెక్ట్ లో మునిగిపోతోన్నది.. నూతన ఆలయం ప్రారంభించకుండానే ప్రాజెక్టులోకి నీళ్లు వదలడంతో ఎల్లమ్మ ఆగ్రహించి అడ్డంకులు సృష్టిస్తోందని స్థానికులు చెబుతున్నారు. ప్రాజెక్టు మోటార్లు రన్ అవుతున్నాయన్న సమాచారంతో ప్రజలు ప్రాజెక్టు వద్దకు చేరుకోగానే పంపులు బంద్ కావడంతో చూడలేకపోయామని అసహనం వ్యక్తం చేస్తూ నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఏదిఏమైనా హడావిడిగా ప్రారంభించుకున్న రంగనాయక సాగర్ గోదావరి జలాలు ఎత్తిపోతలో సమస్యలు తలెత్తుతున్నాయి.
Tags: Ranganayaka sagar project, moters, water, ellamma, village peoples