ధర్నాలు వద్దు… మాట్లాడుకుందాం రండి : ఈటల

by Shyam |   ( Updated:2023-03-28 16:59:47.0  )
ధర్నాలు వద్దు… మాట్లాడుకుందాం రండి : ఈటల
X

దిశ, న్యూస్ బ్యూరో: గాంధీ ఆసుపత్రిలో విధి నిర్వహణలో ఉన్న డాక్టర్లపై పేషెంట్ల బంధువులు చేయి చేసుకోడాన్ని నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు ధర్నాకు దిగారు. ఆసుపత్రి ఆవరణ నుంచి రోడ్డుపైకి వచ్చి ధర్నా చేశారు. దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రిలోనూ వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని, ప్రతీ వార్డులో రాష్ట్ర ప్రత్యేక పోలీసులను నియమించాలని, ఇకపైన ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పారా మిలిటరీ బలగాలను దించాలని జూనియర్ డాక్టర్లు ప్లాకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఆవరణ నుంచి రోడ్డుపైకి రాకుండా నిలువరించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. గాంధీ ఆసుపత్రిలో కరోనా పేషెంట్లకు అందాల్సిన సేవలకు అంతరాయం కలుగుతుందనే ఉద్దేశంతో మంత్రి ఈటల రాజేందర్ కొద్దిమంది జూనియర్ డాక్టర్లతో మాట్లాడారు. ధర్నాలు, నిరసనలతో వైద్య సేవలకు అంతరాయం కలుగుతుందని, మాట్లాడుకోవడం ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సూచించారు. జూనియర్ డాక్టర్ల తరపున ప్రతినిధి బృందం వెంటనే సచివాలయానికి రావాల్సిందిగా మంత్రి విజ్ఞప్తి చేశారు. ఆందోళన విరమించాలని కోరారు. మరోవైపున మంగళవారం రాత్రి వైద్యులపై దాడిచేసిన ఇద్దరిని చిలుకలగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story