మహిళా దినోత్సవం.. మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన

by Sridhar Babu |
Maoist party
X

దిశ, భద్రాచలం: అంతర్జాతీయ శ్రామిక మహిళా దినపు 111 ఏళ్ళ వారసత్వాన్ని గ్రామగ్రామాన సమరశీలంగా జరుపుకుందామని, అదే క్రమంలో స్త్రీలపై జరుగుతున్న అన్నిరకాల దాడులను వ్యతిరేకిస్తూ ఉద్యమిద్దామని, మావోయిస్టు పార్టీ చర్ల–శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.‌ మణుగూరు ఏరియా దళం సభ్యురాళ్లైన రాజే, లలిత గ్రామానికి పనిమీద పోయినపుడు పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చెన్నాపురం అడవుల్లో బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని పేర్కొన్నారు.

అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్ళిన జిల్లా కమిటీ సభ్యురాలు సుజాతను అరెస్టు చేసి జగదల్‌పూర్ జైల్​లో బంధించారని తెలిపారు. చర్ల-శబరి ఏరియాలో మిలీషియాలో పనిచేస్తున్న పురుషులు, మహిళలను అరెస్టులు చేస్తున్నారని, ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్ళుగా భూస్వాములు ఆదివాసీ యువతులపై అత్యాచారాలు చేయడం, రెండో భార్యగా చేసుకొని వారి జీవితాలను నాశనం చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు, ఎన్‌జీవోలు అందాల పోటీలు, ముగ్గుల పోటీలు, అవార్డుల పేరుతో మహిళా దినోత్సవాన్ని పక్కదారి పట్టిస్తున్నారని తెలిపారు. అలా జరపడాన్ని వ్యతిరేకిస్తూ విప్లవ స్ఫూర్తితో స్వేచ్ఛ, సమానత్వం, అణిచివేతలేని సమసమాజ స్థాపన కోసం కొనసాగుతున్న పోరాటంలో మహిళలు కలిసి రావాలని, అప్పుడే మహిళలకు నిజమైన విముక్తి లభిస్తుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed