ఈతకు వెళ్లి ఫిలింనగర్‌కు చెందిన వ్యక్తి మృతి

by Shyam |   ( Updated:2021-03-13 10:57:30.0  )
man died
X

దిశ, మెదక్: అధికారుల అలసత్వం.. కాంట్రాక్టర్ల విచ్చలవిడితనం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. మెదక్ కొల్చారం మండల కేంద్రంలోని మాసానికుంటలో ఈతకని వెళ్లి యువకుడు గల్లంతైన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఫిలింనగర్ ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు ఓర్సు శివ, సుక్క శివ, అబ్దుల్ రహమాన్, సాలె సురేష్‌లు ఏడుపాయల జాతరకు వచ్చారు. శుక్రవారం రాత్రి అక్కడే బస చేసి, దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో స్థానిక కొల్చారం మండలంలోని మాసానికుంటలో ఈతకు వెళ్లారు. ఇంతలో నరేష్(27) అనే యువకుడు గల్లంతయ్యాడు. అతనికి ఈత వచ్చని, కానీ కుంటలోతు అంచనా సరిగ్గా వేయకపోవడంతో గల్లంతయినట్టు స్నేహితుల తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గజ ఈతగాళ్ళతో గాలింపు చర్యలు ప్రారంభించారు. శనివారం రాత్రివరకూ గాలించినా యువకుడి ఆచూకి దొరకలేదు.

ప్రాణం తీసిన గుంతలు..

జిల్లాలో అనేక చోట్ల అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వీటిలో చాలా వాటికి అనుమతులు ఉండవు. సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల అండదండలతో ఈ దందా సాగుతున్నట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన ప్రాంతంలో జీసీబీలతో మట్టి తవ్వకాలు కనిపిస్తున్నాయి. కేవలం మూడు ఫీట్ల వరకే తాము పర్మిషన్లు ఇస్తున్నామని సంబంధిత ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చెబుతున్నా, వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. కాంట్రాక్టర్లు ప్రజా ప్రతినిధులు ఇచ్చే ఆమ్యామ్యాలకు అలవాటు పడిన అధికారులు చోద్యం చూస్తున్నారు. నిత్యం ట్రాక్టర్లు, టిప్పర్లు, జీసీబీలతో అక్రమ తవ్వకాలు జరుగుతున్నా.. వీటిని అడిగే నాధుడే కరువయ్యాడు. మండలానికి చెందిన కొంతమంది ప్రజాసంఘాల నాయకులు ఈ విషయమై పలుమార్లు సంబంధిత అధికారులకు చెప్పినా.. దందా మాత్రం ఆగడం లేదు. అధికార పార్టీకి చెందిన నాయకుల అండతోనే ఇల్లీగల్ కార్యక్రమాలు నడుస్తున్నాయని తెలిపారు. మాములు సమయంలోనే అడగని పరిస్థితి, దీనికి తోడు ఏడుపాయల జాతర ఇంకేముంది రాత్రి పగలు అనే తేడా లేకుండా ఈ తతంగం నడుపుతున్నట్టు తెలుస్తోంది. అక్రమంగా మట్టి తవ్వకాలు, ఇసుక మాఫియాపై జిల్లా కలెక్టర్ స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యం వీడకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతాయని వాపోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed