మండుతున్న ఎండలు

by Shyam |   ( Updated:2020-05-21 21:23:32.0  )
మండుతున్న ఎండలు
X

దిశ, న్యూస్‌బ్యూరో : ఏప్రిల్ నుంచే ఎండలు, వడగాల్పులతో ఇబ్బందులు పడటం ప్రతీ ఏడాది కనిపించేదే. ప్రస్తుతం మే నెల చివరికి చేరుకుంటున్నాం. అయినా ఈ సారి ఎండాకాలం తీవ్రత తక్కువగా ఉంది. గతేడాదితో పోలిస్తే తక్కువ స్థాయిలో ఉష్టోగ్రత నమోదవడంతో లాక్‌డౌన్, ఇతర కారణాలతో వేసవి ప్రభావం కనబడలేదు. ఈ నెల 22 నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచిస్తోంది.

ఎండల తీవ్రత ఈ ఏడాది తక్కువగా ఉంది. ఎండల కారణంగా వచ్చే ఇబ్బందులను చాలా వరకూ తప్పించుకోగలిగాం. గతేడాది కంటే ఈ ఏడాది తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం ఒక కారణంగా, అప్పుడప్పుడు కురిసిన వర్షాలు, లాక్‌డౌన్ కూడా ఒకరకంగా వేసవి తాపాన్ని తప్పించాయి. 2019లో ఏప్రిల్ నెల నుంచే 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవగా.. ఈ సారి గత రెండు రోజులుగా మాత్రమే ఆ ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురిశాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడింది. ఏప్రిల్ నుంచే అడపాదడపా తేలికపాటి వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా కురిశాయి.

ఉష్ణోగ్రతల్లో తగ్గుదలతో పాటు లాక్‌డౌన్ కావడంతో ప్రజలు ఎక్కువగా బయటకు రాలేదు. మార్చి చివరి వారం నుంచి ఏప్రిల్ నెలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. మే 15 తర్వాత లాక్‌డౌన్ సడలింపులతో బయటకు వస్తున్నారు. మూడు నెలల కాలంలో నేరుగా ఎండ తీవ్రతను ఎదుర్కునే అవకాశం లేకపోవడంతో వేసవి కాలం వచ్చినట్టు కనిపించలేదు. ప్రజలతో పాటు వాహనాలు సైతం బయటకు రాలేదు. కంపెనీలు, పరిశ్రమలు కూడా మూతపడ్డాయి. ఇంధనాల, కంపెనీల నుంచి పొగ, ఇతర కాలుష్య కారకాలు వెలువడటం ఆగిపోవడంతో ఆ ప్రభావం వాతావరణంపై పడింది. గాలిలోని కాలుష్యం తగ్గడంతో పాటు ఉష్ణోగ్రత తీవ్రత సైతం తక్కువగా నమోదయ్యింది. ఎండల తీవ్రత తక్కువ ఉండటం, ప్రజలు సైతం ఎక్కువగా బయటకు రాకుండా ఉండటంతో ఈ ఏడాది వడదెబ్బ, ఎండ తీవ్రతకు సంబంధించిన ఇబ్బందులు తక్కువగా ఉన్నాయి. ఈ వేసవిలో ఇప్పటి వరకు గరిష్టంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకూ నమోదయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

మే 22 నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో వాయివ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని, సూపర్ సైక్లోన్ ప్రభావం వల్ల వాతావరణంలో తేమ తగ్గడంతో ఎండలు పెరుగుతాయని శాఖ అధికారులు వివరిస్తున్నారు. రానున్న 2, 3 రోజుల్లో వర్షపాతానికి అవకాశం లేదు. రాష్ట్రంలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని, వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వడదెబ్బకు గురికాకుండా తగిన రక్షణ చర్యలను పాటించాలని శాఖ అధికారులు సూచిస్తున్నారు.

గతేడాది, ఈ ఏడాది ఉష్ణోగ్రతలో వ్యత్యాసం
తేదీ 2019 2020
మే 15 43 38
మే 16 42 38
మే 17 42 37
మే 18 42 40
మే 19 43 39
మే 20 42 41
మే 21 42 42
మే 22 41 40

Advertisement

Next Story