బాలికపై తాత, మామ దారుణం.. బ్రిడ్జికి శవం వేలాడటంతో గుట్టురట్టు

by Sumithra |   ( Updated:2021-07-22 08:07:49.0  )
Girl murdered
X

దిశ, వెబ్‌డెస్క్ : పిల్లలు తప్పు చేస్తే మందలించి మంచి మార్గంలో నడిపించాల్సిన పెద్దలే ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు. సామ, దాన, భేద, దండోపాయాలను వదిలి, హత్యలే పరిష్కారంగా భావిస్తూ.. రక్త సంబంధీకులను సైతం అంతమొందిస్తున్నారు. తమ మాట వినడం లేదని, కుటుంబానికి చెడ్డపేరు తెస్తోందని ఓ బాలికను ఆమె తాత, మేనమామ కలిసి కడతేర్చారు. పైగా హత్యను ప్రమాదంగా చిత్రీకరించి అడ్డంగా బుక్కయ్యారు. ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం పంజాబ్‌లో నివాసం ఉంటుంది. వారికి 17 ఏళ్ల కూతురు ఉంది. బాలిక తండ్రి పంజాబ్‌లో వలస కార్మికుడిగా పని చేస్తున్నాడు. కాగా, ఇటీవల బాలికతో కలిసి ఆమె తల్లి తన పుట్టిలైన డియోరియాకు వచ్చింది. అయితే బాలిక పద్ధతులు, ఆమె వ్యవహార శైలి తాతకు, మామకు నచ్చలేదు. దీంతో ఆమెపై కోపం పెంచుకున్నారు. రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలిక తాత ఆమెపై రాడ్‌తో దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అయితే బాలిక తల్లికి అనుమానం రాకుండా ఉండేలా.. నీ కూతరు కిందపడి గాయాలపాలైందని, ఆస్పత్రికి తీసుకెళ్తున్నాం అని చెప్పి తీసుకెళ్లారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన బాలిక మార్గమధ్యలోకి వెళ్లగానే ప్రాణాలు విడిచింది.

బాలిక మృతితో కంగారు పడిన తండ్రీకొడుకు.. ప్రమాదంలోనే చనిపోయినట్లు కుటుంబ సభ్యులను నమ్మించారు. అనంతరం బాలిక మృతదేహాన్ని డియోరియాలోని రైల్వే బ్రిడ్జి మీదినుంచి కిందను తోసేసి వెళ్లిపోయారు. అంతటితో కథ సుఖాంతం అయిందని ఊపిరి పీల్చుకున్నారు. అయితే చేసిన పాపం ఊరికే పోదంటారు పెద్దలు. అదే వీరి విషయంలో నిజం అయింది. బాలిక మృతదేహాన్ని రైల్వే బ్రిడ్జి మీది నుంచి తోసేసిన తండ్రీకొడుకు అది కిందపడిందో లేదో చూడకుండనే వెళ్లారు. అయితే ఆ బాలిక కాలు బ్రిడ్జి మధ్యలో చిక్కుకుని వేలాడబడింది. అలా సోమవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారు జాము వరకు మృతదేహం వేలాడబడింది. అటుగా వెళ్లిన స్థానికులు బాలిక మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి పోస్ట్ మార్టం చేయించడంతో బాలిక తాత, మామ చేసిన ఘాతుకం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Next Story