- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆశా’వర్కర్లు, ఏఎన్ఎంలకు ఉచితంగా 4-జీ సిమ్‌లు.. దానికోసమే..?
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా వైరస్ ఇప్పుడు గ్రామాలకు కూడా పాకడంతో క్షేత్రస్థాయిలో ‘ఆశా‘ వర్కర్లు, ఏఎన్ఎంల సేవలు కీలకమని ప్రభుత్వం గుర్తించింది. సెకండ్ వేవ్ పరిస్థితి ఊహించినదానికంటే తీవ్రంగా ఉన్నందున థర్డ్ వేవ్ వచ్చే నాటికి మొత్తం ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేయాలని భావించింది. ప్రతీ ఇంటి వివరాలు హెడ్ క్వార్టర్ దగ్గర ఉంటే తదనుగుణమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించవచ్చని వైద్యారోగ్య శాఖ భావించింది. గ్రామ స్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఫీవర్ సర్వే, కరోనా మెడికల్ కిట్ల పంపిణీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై లోడ్ తదితరాలన్నింటినీ ఎప్పటికప్పుడు హెడ్ క్వార్టర్‌కు అందేలా నిర్దిష్ట మెకానిజాన్ని వైద్యారోగ్య శాఖ రూపొందిస్తోంది. అందులో భాగంగా ఆశా వర్కర్లకు సుమారు పాతిక వేల 4-జీ పోస్ట్-పెయిడ్ మొబైల్ సిమ్‌లను, ఏఎన్ఎంలకు సబ్ సెంటర్ స్థాయిలో నాలుగు వేల సిమ్‌లను సమకూర్చాలని నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు వారి సొంత మొబైల్ ఫోన్లు, టాబ్‌ల ద్వారానే వివరాలను హెడ్ క్వార్టర్‌కు పంపుతున్నారు. అయితే ఒక్కొక్కరి దగ్గర ఒక్కో రకమైన మొబైల్ సిమ్ కార్డు ఉండడంతో సిగ్నళ్ళు లేకపోవడం లాంటి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో సమాచారం హెడ్ క్వార్టర్‌కు చేరడంలో జాప్యం జరుగుతోంది. దీన్ని నివారించడానికి ఇకపైన అందరికీ ఒకే రకమైన సిమ్ కార్డులను అందజేయడం ఉత్తమం అని భావించింది. అన్నీ పోస్టు-పెయిడ్ సిమ్ కార్డులు కావడంతో ప్రభుత్వమే వాటిని గ్రూపు కనెక్షన్ కింద పరిగణించి ప్రతీ నెలా బిల్లు కట్టేస్తుంది. దీంతో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇప్పటివరకు పడిన ఇబ్బందులను తొలగించవచ్చని భావించింది. నెల రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసేలా ఈ నెల చివరికల్లా టెండర్ల ప్రక్రియను ఖరారు చేయనుంది.
బహుముఖ వ్యూహం
ప్రస్తుతం గ్రామాల్లో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు అనేక రకాల సేవలను ప్రజలకు అందిస్తున్నారు. ఆ వివరాలే ప్రభుత్వానికి ప్రామాణికంగా మారుతున్నాయి. లబ్ధిదారులు ఎంతమందో నిర్దిష్టంగా తెలియడం ద్వారా భవిష్యత్తులో చేపట్టబోయే పలు రకాల విధాన నిర్ణయాలకు క్షేత్రస్థాయిలోని పరిస్థితులు ఆధారంగా ఉంటున్నాయి. ఇప్పుడు చేపడుతున్న ఫీవర్ సర్వే మాత్రమే కాక ఇకపైన ‘హెల్త్ ప్రొఫైల్‘ లాంటివాటికి కూడా ఇది ఉపయోగపడుతుందనేది ప్రభుత్వ అభిప్రాయం. పోస్ట్-పెయిడ్ సిమ్‌లను అందించిన తర్వాత సిగ్నళ్ళ లాంటి సాంకేతిక సమస్యలను అధిగమించడానికి తీసుకునే చర్యలు కూడా టెండర్ దక్కించుకున్న సంస్థదే అవుతుంది.
విస్తృత సంఖ్యలో వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను నిర్దిష్ట ఫార్మాట్‌లో పంపించాల్సి ఉన్నందున నెలకు గరిష్టంగా 30 జీబీ మేర డాటాను వినియోగించుకునేలా, అపరిమితంగా వాయిస్ కాల్స్ చేసుకునేలా 4-జీ సిమ్‌ల టారిఫ్‌ను ఖరారు చేస్తోంది. నగరాలు, పట్టణాల పరిధిలో 4-జీ నెట్‌వర్క్ ఉంటున్నప్పటికీ మారుమూల ప్రాంతాల్లో 2-జీ కూడా లేకపోవడంతో వైద్యారోగ్య శాఖ వివరాల సంకలనంలో పలు సమస్యలను ఎదుర్కొంటున్నది. ఇకపైన ఇలాంటి సమస్యలు లేకుండా చేయడం కోసం వివిధ శాఖలు సమీక్షించి సంయుక్తంగా 4-జీ పోస్ట్-పెయిడ్ సిమ్ కార్డులను అందివ్వడం ఉత్తమమని భావించింది. నెల రోజుల వ్యవధిలో పాతిక వేల మంది ఆశా వర్కర్లకు, నాలుగు వేల మంది ఏఎన్ఎంలకు ఈ సిమ్ కార్డులు అందనున్నాయి.