- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జీవోల జాతర.. పారదర్శకతకు పాతర
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రహస్య పాలన సాగుతున్నది. విధాన నిర్ణయాలు బయటకు రావడం లేదు. సర్కారు జారీచేసే ఉత్తర్వులు కనిపించడం లేదు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం వాటిని తొక్కిపెడుతున్నది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో కాస్త పారదర్శకంగా అన్ని జీవోలనూ పెట్టినా ఆ తర్వాత పరిస్థితి మారింది. కొంతకాలం మొత్తం వెబ్‌సైట్‌నే బ్లాక్ చేసింది. ‘కాన్ఫిడెన్షియల్’ మినహా మిగిలిన అన్ని జీవోలనూ వెబ్‌సైట్‌లో పెట్టి ప్రజలకు తెలియజేసేలా ఉండాలన్నది నిబంధన. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. చివరకు ప్రతిష్ఠాత్మకమని చెప్పుకుంటున్న ‘దళితబంధు’ నిబంధనల జీవోనూ దాచేసింది. ఇదే అంశంపై హైకోర్టు స్పందించింది. 24 గంటల్లో వెబ్‌సైట్‌లో పెట్టాలని ఆదేశించింది. కానీ ఈ ఆదేశాన్ని సర్కారు బుట్టదాఖలా చేసింది.
రాష్ట్రంలో దాదాపు ఆరున్నరేళ్లుగా ఇదే తీరు కొనసాగుతున్నది. సర్కారు తీరును సవాలు చేస్తూ గతంలోనే హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫున రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి పద్మనాభరెడ్డి, కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్, బీజేపీ నేత పేరాల శేఖర్ రావు తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి సీజే ఆర్ఎస్ చౌహాన్ సైతం ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. 4వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటికీ ఆ పిటిషన్లపై విచారణ కొనసాగుతూనే ఉన్నది.
జీవోల జారీ సాగిందిలా..
సమైక్య రాష్ట్రంలో దాదాపు ఏడేండ్ల పాటు సగటున 44 వేలకు పైగా జీవోలు జారీ అయ్యేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చే జీవోల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. ఏపీలో మాత్రం సగటున 20 వేలకు పైగా జీవోలు ఏటా విడుదలవుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఆంధ్రప్రదేశ్‌తో సమానంగా ఆరు నెలల పాటు 10 వేలకు పైగా జీవోలు జారీ అయ్యాయి. ఆ తర్వాత సంవత్సరం (2015లో) కూడా ఏపీలో 23,500కు పైగా జీవోలు వెబ్‌సైట్‌లో కనిపిస్తే తెలంగాణలో 21,700కు పైగా ఉన్నాయి. కానీ ఆ తర్వాత ఏడాది నుంచి క్రమంగా తగ్గింది. 5 వేల కన్నా దిగువకు పడిపోయింది. జారీ అయ్యే జీవోలపై ప్రజలకు తెలియకూడదనే ఉద్దేశంతోనే పబ్లిక్ డొమెయిన్‌లో పెట్టడంలేదు. స్వయంగా ముఖ్యమంత్రే ఒక సందర్భంలో అసెంబ్లీలో ‘జీవోలు విడుదల కాగానే ఎవరో ఒకరు దాన్ని పట్టుకుని కోర్టుకు వెళ్తున్నారు. ప్రభుత్వం చేయాలనుకున్న పనులకు ఆటంకం కలిగిస్తున్నారు.
ప్రాజెక్టులు కడదామనుకుంటే కోర్టుకు వెళ్లి స్టే తెస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీకి చెందినవారే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. అప్పటి నుంచే కీలకమైన జీవోలు వెబ్‌సైట్‌లోకి రావడం బంద్ అయింది. సమైక్య రాష్ట్రంలో‘ కాన్ఫిడెన్షియల్’జీవోలు సైతం వెబ్‌సైట్‌లో కనిపించినా ఆ వివరాలు ప్రజలకు తెలియకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునేది. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత అసలు జీవో జారీ అయిందో లేదో అనేదే తెలియని పరిస్థితి నెలకొంది.
గడిచిన ఆరున్నరేండ్లుగా వెబ్‌సైట్‌లో జీవోల అప్‌లోడ్ తంతు పావు వంతుకు పడిపోయింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కేవలం 73 వేల జీవోలు మాత్రమే జారీ అయినట్టు వెబ్‌సైట్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పేరాల శేఖర్ 2019లో కోర్టును ఆశ్రయించే నాటికే 1.04 జీవోలు జారీ అయినట్టు పిటిషన్‌లో పేర్కొన్నారు. అప్పటికి 42,462 జీవోలు మాయమైనట్లు కోర్టుకు వివరించారు. ఇదిలా ఉండగా ‘దిశ’కు అందిన అధీకృత సమాచారం ప్రకారం 2014 జూన్ నుంచి 2019 సెప్టెంబరు వరకు రాష్ట్రంలో మొత్తం 1,16,279 జీవోలు జారీ అయితే అందులో 3,982 అప్‌లోడ్ చేయలేదు. అదనంగా మరో 47,671 జీవోలు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ స్వభావంతో కూడినవి కావడంతో వాటిని ప్రజల్లోకి తీసుకురాలేదని పేర్కొన్నది. కేవలం 63,898 మాత్రమే పబ్లిక్ డొమెయిన్‌లో పెట్టినట్లు ప్రభుత్వం ధ్రువీకరించింది.
పరిశ్రమలశాఖకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే, ఇదే కాలంలో మొత్తం 2,009 జీవోలు జారీ అయ్యాయి. అందులో 1,335 మాత్రమే పబ్లిక్ డొమెయిన్‌లో పెట్టినట్లు తేలింది. ఇక పురపాలక శాఖకు సంబంధించి మొతం 5,359 జీవోలు జారీ అయితే అందులో కేవలం 1,540 మాత్రమే వెబ్‌సైట్‌లో కనిపిస్తున్నాయి. సుమారు 3,800 జీవోలు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ పేరుతో ప్రజలకు తెలియకుండా గోప్యంగానే ఉంచింది. ఏటా సగటున 21 వేలకు పైగా జీవోలు జారీ అవుతున్నా అందులో సగం కూడా వెబ్‌సైట్‌లో ఉండడంలేదు. 2019 సెప్టెంబరు చివరి నుంచి ఇప్పటివరకు దాదాపు రెండేళ్లలో 40 వేలకు పైగా జీవోలు జారీ అయినట్టు అంచనా. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు ఒక్కో చదరపు గజానికి రూ. 100 లెక్కన ప్రతి జిల్లాలో ఎకరం భూమి చొప్పున కేటాయిస్తూ 2019 జూన్‌లో ప్రభుత్వం ఇచ్చిన జీవో (నెం. 66) వెబ్‌సైట్‌లో అందుబాటులో లేదు. ఇంటర్ విద్యార్థుల పరీక్షా ఫలితాల్లో జరిగిన గందరగోళం కారణంగా పాతిక మంది చనిపోయిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటుచేస్తూ ఇచ్చిన జీవోనూ వెబ్‌సైట్‌లో పెట్టలేదు. ఇలాంటి చాలా జీవోలు ప్రజలకు ఇప్పటికీ అందుబాటులో లేవు.
తాజాగా టీచర్ల క్రమబద్ధీకరణ కోసం జీవో నెం. 25ను ప్రభుత్వం ఈ నెల 12న జారీ చేసిన తర్వాత వ్యతిరేకత వ్యక్తం కావడంతో సవరిస్తూ జీవో నెం. 28ను ఆగస్టు 18న ఇచ్చింది. ఈ రెండూ వెబ్‌సైట్‌లో అందుబాటులో లేవు. సుమారు లక్షన్నర మంది టీచర్లకు సంబంధించిన అంశం కూడా ప్రభుత్వం దృష్టిలో రహస్యంగా మారింది. హైకోర్టులో వాసాలమర్రి గ్రామానికి సంబంధించిన ‘దళితబంధు’ జీవోపై ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీచేసినా 24 గంటల్లో ఆ రెండు జీవోలను పెట్టలేదు. ఇదిలా ఉంటే సాధారణ పరిపాలన శాఖ తరపున జీవో ఆర్‌టీ నెం. 1865, 1867లను వెబ్‌సైట్‌లో పెట్టిన సర్కారు మధ్యలో ఉండాల్సిన నెం. 1866ను మాత్రం గోప్యంగానే ఉంచింది. హైకోర్టు ఒక రోజు ముందు చెప్పినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇలాంటి ఉదాహరణలు వేలల్లోనే ఉన్నాయి.