World Blitz Championship title : ఉమ్మడి విజేతలుగా కార్ల్‌సన్- నెపొమ్నియాచి

by Sathputhe Rajesh |
World Blitz Championship title : ఉమ్మడి విజేతలుగా  కార్ల్‌సన్- నెపొమ్నియాచి
X

దిశ, స్పోర్ట్స్ : న్యూయార్క్‌లో జరుగుతున్న వరల్డ్ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌ ఉమ్మడి విజేతలుగా మాగ్నస్ కార్ల్‌సన్, నెపొమ్నియాచి నిలిచారు. ఫైనల్‌లో ఏడు రౌండ్లు ముగిసిన తర్వాత ఇద్దరు టైకు అంగీకరించారు. దీంతో ప్రపంచ టైటిల్ పంచుకున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ కార్ల్‌సన్ ఫైనల్‌లో తొలుత ఆధిపత్యం చెలాయించాడు. మొదటి రెండు రౌండ్‌లను గెలుచుకున్నాడు. వెంటనే పుంజుకున్న నెపొమ్నియాచి 2-2తో స్కోరు సమం చేశాడు. తర్వాత మూడు గే‌మ్‌లు డ్రాగా ముగిశాయి. కార్ల్‌సన్ టైటిల్ పంచుకోవాలని ప్రతిపాదించగా నెపొమ్నియాచి ఇందుకు అంగీకరించాడు. కాసేపు వేదిక వద్ద అధికారులు చర్చించి ఇద్దరిని వరల్డ్ బ్లిట్జ్-2024 ఛాంపియన్‌లుగా ప్రకటించారు. మహిళల విభాగంలో టైటిల్ పంచుకునేందుకు అవకాశం ఇవ్వలేదని మరి పురుషుల విభాగంలో టైటిల్ పంచుకునేందుకు ఎలా అవకాశం ఇచ్చారని కొంత మంది ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో డ్రెస్ కోడ్ కారణంగా కార్ల్‌సన్‌కు ఫిడే 200 డాలర్లు జరిమానా విధించింది. ఈ ఘటనతో టోర్నీ నుంచి తప్పుకున్నట్లు కార్ల్‌సన్ ప్రకటించాడు. అనంతరం ఫిడే ప్రెసిడెంట్ అర్కడీ డ్వార్కోవిచ్ డ్రెస్ కోడ్ విషయంలో సడలింపు చేస్తున్నట్లు డిసెంబర్ 29న ప్రకటించాడు. ఈ ప్రకటన తర్వాత కార్ల్‌సన్ తిరిగి వరల్డ్ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు.

Advertisement

Next Story