ఆన్​లైన్​లో అప్రూవ్​… ఆఫ్​లైన్​లో పెండింగ్..​ రాష్ట్రంలో కొత్త పింఛన్ల తీరిది

by Shyam |   ( Updated:2021-09-21 09:14:08.0  )
ఆన్​లైన్​లో అప్రూవ్​… ఆఫ్​లైన్​లో పెండింగ్..​ రాష్ట్రంలో కొత్త పింఛన్ల తీరిది
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఒక చేత్తో ఇచ్చి.. మరో చేత్తో లాక్కొవడం అంటే ఇదే. రాష్ట్రంలో ఆసరా పింఛన్​దారుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. కొత్త పింఛన్లు ఇస్తున్నట్లు గొప్పలు చెప్పిన ప్రభుత్వం.. వాటికి మంజూరు ఇచ్చినట్టే ఇచ్చి పెండింగ్​ పెట్టింది. అంతేకాకుండా కొత్త పెన్షన్లన్నీ మంజూరు చేసినట్లుగా నివేదికల్లో పేర్కొంటున్నారు.

హుజురాబాద్​లో శాంక్షన్​

టీఆర్​ఎస్​ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పెన్షన్లను మొత్తం నిలిపివేశారు. కొత్త వాటి కోసం దరఖాస్తు చేసుకున్నా.. మంజూరి నిలిపివేశారు. తాజాగా రెండు నెలల కిందట హుజురాబాద్​ ఉప ఎన్నిక వస్తుందనే కారణంగా కొత్త పెన్షన్లు, రేషన్​ కార్డులను ఇస్తున్నట్లు ప్రకటించారు. 2018 నాటికే కొత్త పెన్షన్​ కోసం 4.80 లక్షల దరఖాస్తులు పెండింగ్​ ఉన్నాయి. మళ్లీ కొత్త దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నట్లు ఆన్​లైన్​లో వెబ్​సైట్​ను ఓపెన్​ చేశారు. కానీ నాలుగు రోజులు కూడా ఉండకుండానే మళ్లీ లాక్​ చేశారు. అయితే హుజురాబాద్​ నియోజకవర్గంలో మాత్రం తీసుకున్నారు. అంతేకాకుండా ఈ సెగ్మెంట్​లో కొత్త దరఖాస్తులకు పెన్షన్లకు మంజూరి ఇచ్చి, ఆర్థిక శాఖ నుంచి అనుమతి సైతం జారీ చేశారు. దీంతో జూలై నుంచే వారికి పెన్షన్లు అందుతున్నాయి.

రాష్ట్రమంతా పెండింగ్​

అయితే రాష్ట్రమంతటా దరఖాస్తులు తీసుకున్నారు. వీటిలో వృద్ధులు, వితంతుల దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయి. పాత వాటిని క్లియర్​ చేస్తున్నట్లు ప్రకటించారు. వాటన్నింటికీ ఆన్​లైన్​లో అప్రూవ్​ చేశారు. దీంతో మొత్తం 4.80 లక్షల మంది దరఖాస్తుదారులకు పెన్షన్​ వస్తుందని ఆశపడ్డారు. కానీ ఆన్​లైన్​లో అప్రూవ్​ చేసి ఆర్థిక శాఖలో మాత్రం బ్రేక్​ వేశారు. దీంతో వెబ్​సైట్​లో ఒక్క అప్లికేషన్​ కూడా పెండింగ్​ లేదని చూపిస్తోంది. కానీ ఆఫ్​లైన్​లో మాత్రం వాటిని నిధులు ఇవ్వలేదు. కొత్తగా పెన్షన్​ మంజూరైనట్లు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యే కార్యాలయాల నుంచి ఫోన్లు చేశారు. సంబంధిత మెస్సెజ్​లను సైతం పంపించారు. అయితే ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్​ లేకపోవడంతో వాటికి నిధులు విడుదల కాలేదు. తమకు పెన్షన్​ మంజూరైందని సంబురపడి అధికారుల దగ్గరకు వెళ్తే.. పింఛన్​ సొమ్ము రాలేదని తిరిగి పంపిస్తున్నారు. దీనిపై అధికారులను అడిగితే ఫైనాన్స్​ క్లియరెన్స్​ లేదని చెప్పుతున్నట్లు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇస్తారా.. ఇవ్వరా..?

అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తామని చెప్పిన సర్కారు.. ఇచ్చినట్టే ఇచ్చి బ్రేక్​ వేసింది. ఇప్పుడు కూడా హుజురాబాద్​ సెగ్మెంట్​కు విడుదల చేస్తున్నారు. కానీ రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలన్నింటా ఆపేశారు. కొత్త పెన్షన్లు ఇస్తరా.. లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటికి తోడుగా 57 ఏండ్లు పైబడిన వారి దరఖాస్తులు కూడా పెండింగ్​లోనే ఉన్నాయి.

Advertisement

Next Story