మోసం చేయడమే టీఆర్​ఎస్​ లక్ష్యం : చిన్నారెడ్డి

by Shyam |
మోసం చేయడమే టీఆర్​ఎస్​ లక్ష్యం : చిన్నారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసేందుకు టీఆర్​ఎస్​ ప్రణాళిక చేసుకుందని, మోసం చేయడమే లక్ష్యమని కాంగ్రెస్​ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డి విమర్శించారు. వచ్చే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. శుక్రవారం గాంధీభవన్​లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న నాగార్జున సాగర్ ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్‌ హాలియాలో వరాలు కురిపించారన్నారు. ఈ నెల 11న ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్​ వస్తుందని సీఎంకు ముందే తెలుసన్నారు.

రాష్ట్రంలోని ఉద్యోగులు, యువత నిరాశలో ఉన్నారని, సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ పదేపదే నిరుద్యోగ భృతి, పీఆర్సీ ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. బిస్వాల్​ రిపోర్డు వచ్చిన తర్వాత కూడా స్పందించలేదని చిన్నారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించారని, రైతు సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ విఫలమైందని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ వచ్చాకా ఇంటికో ఉద్యోగం వస్తుందని అందరు భావించారని, 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన సీఎం ఇప్పుడు ఎన్నికల కోడ్​ కారణంగా మాట మారుస్తారని, ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత భర్తీ చేయరన్నారు.

రాష్ట్రంలో అన్ని శాఖల్లో లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిశ్వాల్ కమిటీ చెప్పిందని, కానీ నిన్నటి వరకు రాష్ట్రంలో 2. 69 లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నాయన్నారు. రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కింద రూ. 75 వేల బాకీ పడిందని, ముందుగా వాటిని చెల్లించాలని డిమాండ్ చేశారు. రిటైర్​మెంట్ ప్రక్రియలో ప్రతినెలా 800 మంది రిటైర్ అవుతున్నారని, ఆ స్థానంలో కూడా ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని దుయ్యబట్టారు.

Advertisement

Next Story

Most Viewed