ఊళ్లో నుంచి బహిష్కరించారు.. ఇంతకీ వీళ్లు చేసిన తప్పేంటి..?

by Sumithra |   ( Updated:2021-02-28 10:58:30.0  )
ఊళ్లో నుంచి బహిష్కరించారు.. ఇంతకీ వీళ్లు చేసిన తప్పేంటి..?
X

దిశ, వికారాబాద్: హత్యా నేరం ఆరోపణ నేపథ్యంలో జైలుకు వెళ్లొచ్చిన కుటుంబాన్ని ఆ గ్రామంలోకి రానివ్వడం లేదు. దీంతో ఆ కుటుంబ సభ్యులు రెండేళ్లుగా చెట్లు పుట్టల వెంట కాలం గడుపుతూ పడరాని పాట్లు పడుతున్నారు. సదరు కేసులో కనీసం న్యాయస్థానం తీర్పు వెలువరించే వరకైనా తమ కొంపలో తమను బతకనివ్వాలని వేడుకుంటున్నా ‘‘పెద్దలు” ససేమిరా అంటున్నారు. దౌర్భాగ్యపు స్థితిలో రోజులు వెల్లదీస్తున్న గిరిజన కుటుంబం దీనగాథ ఇది..

పూర్తి వివరాళ్లోకి వెళితే..

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం నర్సాపూర్ పెద్ద తండాకు చెందిన గిరిజన కుటుంబం జమీకి బాయి అనే మహిళను హత్య చేసిందనే ఆరోపణతో 2019లో జైలుకు వెళ్లింది. అనంతరం బెయిల్​పై బయటకు వచ్చినా గ్రామస్తులు ఊర్లోకి రానివ్వడం లేదు. పైగా ఘటన జరిగిన సమయంలో ఊరూఊరంతా నిందితుల ఇంటిపై దాడికి దిగి వస్తువులను దహనం చేయడంతో కట్టుబట్టలతో మిగిలామని బాధితులు హీరాలాల్, మోహన్, సుభాష్, శంకర్ వాపోయారు. రెండేళ్లుగా వనవాసం చేస్తున్నామని, తమకు రక్షణ కల్పిస్తే ఊర్లో అందరితో కలిసి కాలం వెల్లదీస్తామని వేడుకుంటున్నారు.

కాగా, తమ ఆస్తి నష్టం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, తాము గ్రామంలో ఉండేలా రక్షణ కల్పించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‎ను‎ సైతం ఆశ్రయించినట్లు బాధితులు తెలిపారు. ఇందుకు స్పందించిన కమిషన్ పోలీసులకు ఆదేశాలిచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హత్యానేరం ఆరోపణలో కోర్టు ఏ తీర్పు ఇచ్చిన శిరసావహిస్తానని, అప్పటివరకు తమకు రక్షణ కల్పించి, గ్రామంలోకి గడపడానికి పోలీసులు భరోసా ఇవ్వాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Next Story