న్యాయ వ్యవస్థలో కీలక మార్పుకు కేంద్రం కసరత్తు.. స్పందించని తెలుగు రాష్ట్రాలు

by Anukaran |   ( Updated:2021-12-12 22:44:40.0  )
Judicial Service
X

దిశ, తెలంగాణ బ్యూరో : సివిల్ సర్వీసుల తరహాలోనే న్యాయవ్యవస్థలో జడ్జీ పోస్టుల భర్తీ కోసం అఖిల భారత జ్యుడిషియల్ సర్వీస్‌ను తేవాలని పదేళ్ల నుంచీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. జిల్లాస్థాయి జడ్జీల మొదలు అన్ని స్థాయిల్లో జ్యుడిషియల్ అధికారుల నియామకానికి ఈ కోర్సును ప్రామాణికంగా తీసుకురావాలన్న ఆకాంక్ష తొలిసారి 2012లో ప్రస్తావనకు వచ్చింది. మొత్తం న్యాయవ్యవస్థను పటిష్టం చేయడం, కేసుల సత్వర పరిష్కారం, నైపుణ్యం కలిగిన యువతకు, మహిళలకు అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేసింది.

అయితే ఈ ప్రతిపాదనను హైకోర్టులు, రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. ముఖ్యమంత్రులు, హైకోర్టుల చీఫ్ జస్టిస్ స్థాయిలోనూ పలు సమావేశాలు జరిగాయి. భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో కేంద్రం స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోయింది. ఇంకా ఆ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్న కేంద్రం ఏకాభిప్రాయం ద్వారానే విధాన నిర్ణయం తీసుకోవడం సాధ్యమవుతుందని స్పష్టం చేసింది.

అన్ని సివిల్ సర్వీసుల తరహాలోనే న్యాయ వ్యవస్థలో ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్‌ను కూడా ప్రవేశపెట్టడానికి తొలిసారి 2012 నవంబరులో కార్యదర్శుల కమిటీ సమావేశమైంది. ఆ తర్వాత 2013 ఏప్రిల్‌లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల చీఫ్ జస్టిస్‌లతో సంయుక్త సమావేశం నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం ఈ సర్వీసు ఆవశ్యకత, దీని ద్వారా అదనంగా వచ్చే ప్రయోజనాలు, న్యాయవ్యవస్థకు ఏ విధంగా దోహదపడనున్నదీ కూలంకషంగా చర్చించారు. ఆ తర్వాత అన్ని రాష్ట్రాల అభిప్రాయాన్ని సేకరించాలని నిర్ణయం జరిగింది. ఆ ప్రకారం రెండు రాష్ట్రాలు మాత్రమే సానుకూలంగా స్పందించగా ఎనిమిది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఐదు రాష్ట్రాలు మాత్రం కొన్ని మార్పులు చేయాలని సూచించాయి. తెలంగాణ, ఏపీ సహా 13 రాష్ట్రాల నుంచి ఎలాంటి అభిప్రాయం కేంద్రానికి అందలేదు.

ఇక హైకోర్టుల విషయాన్ని పరిశీలిస్తే కేవలం రెండు మాత్రమే సానుకూలంగా స్పందించాయి. 13 హైకోర్టులు వ్యతిరేకించాయి. ఆరు హైకోర్టులు కొన్ని సవరణలకు పట్టుబట్టాయి. ఇంకో రెండు మాత్రం అభిప్రాయాలను వెల్లడించలేదు. ఆ తర్వాత 2015 ఏప్రిల్‌లో రెండు రోజులపాటు హైకోర్టుల చీఫ్ జస్టిస్‌లతో సమావేశమై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నందున జిల్లా స్థాయిలో జడ్జీల నియామకం ఏ పద్ధతిలో జరగాలో ప్రత్యామ్నాయాలను సూచించాలని కోరింది. ఆ వెంటనే మూడవ రోజున ముఖ్యమంత్రులతో కలిపి సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసి అనేక కోణాల నుంచి చర్చించినా ఏకాభిప్రాయం రాలేదు. దీంతో ఆ అంశం పెండింగ్‌లో పడింది.

చివరకు కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ చొరవ తీసుకుని 2017 జనవరిలో జ్యుడిషియల్ సర్వీస్ స్వరూపం, జడ్జీల రిక్రూట్‌మెంట్‌కు ఉండాల్సిన అర్హతలు, ప్రవేశ పరీక్షా విధానం, అభ్యర్థులకు రిజర్వేషన్ల అమలు, వయోపరిమితి తదితరాలన్నింటిపై అన్ని రాష్ట్రాల న్యాయ మంత్రులు, అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, కేంద్ర జ్యుడిషియల్ విభాగం కార్యదర్శి, లెజిస్లేచర్ వ్యవహారల విభాగం కార్యదర్శి తదితరులతో చర్చించింది. రెండు నెలల తర్వాత పార్లమెంటరీ స్థాయీ సంఘంతో సైతం చర్చలు జరిపింది. తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో సైతం ఎస్సీ/ఎస్టీల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ అంశంపై చర్చించింది. కానీ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జ్యుడిషియల్ సర్వీసు ప్రతిపాదన కొలిక్కిరాలేదు. ఏకాభిప్రాయం రాకుండా దీన్ని ప్రవేశపెట్టలేమని రెండు రోజుల క్రితం పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయమంత్రి కిరణ్ రెజిజు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

పదేళ్లుగా జరుగుతున్న కసరత్తు ఏకాభిప్రాయం రాకపోవడంతో కాగితాలకే పరిమితమైంది. ఒకవైపు కేసుల సత్వర పరిష్కారం కోసం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌లు సందర్భం వచ్చిన ప్రతీసారి కేంద్ర న్యాయమంత్రిత్వశాఖతో పలు ప్రతిపాదనలు, సంస్కరణల గురించి చర్చిస్తూనే ఉన్నారు. పెండింగ్ కేసులపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. జిల్లా కోర్టు మొదలు సుప్రీంకోర్టు వరకు ఖాళీగా ఉన్న జడ్జీ పోస్టుల భర్తీపై ప్రభుత్వంమీద వత్తిడి తెస్తూనే ఉన్నారు. కానీ అటు రిక్రూట్‌మెంట్లు ఆశించినంత వేగంగా జరగడంలేదు.. ఇటు కేంద్రం అనుకుంటున్నట్లుగా జ్యుడిషియల్ సర్వీసు కొలిక్కి రావడంలేదు. ఈ ప్రతిపాదన ఎడతెగని చర్చగానే మిగిలిపోయింది.

Advertisement

Next Story

Most Viewed