ఉద్యోగుల విభజనపై సర్కార్ ఫోకస్.. ఖాళీల భర్తీపై త్వరలో సీఎం భేటీ!

by Anukaran |   ( Updated:2021-12-05 23:40:12.0  )
ఉద్యోగుల విభజనపై సర్కార్ ఫోకస్.. ఖాళీల భర్తీపై త్వరలో సీఎం భేటీ!
X

దిశ, తెలంగాణ బ్యూరో : కొత్త జిల్లాలు, కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల విభజన ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చిందని, ఈ నెల చివరికల్లా ప్రాసెస్ పూర్తవుతుందని తెలంగాణ గెజిటెడ్, ఎన్జీవో ఉద్యోగ సంఘం నేతలు ప్రకటించారు. ఉద్యోగ సంఘాల నేతలు ఆదివారం సచివాలయంలో సీఎస్ తో భేటీ అయ్యారు. దీర్ఘకాలంగా జరుగుతున్న విభజన ప్రక్రియ తాజా స్టేటస్‌ను అడిగి తెలుసుకున్నారు. సంక్లిష్టంగా ఉన్న అంశాలపై చర్చించారు. ఈ నెల చివరికల్లా విభజన ప్రక్రియ పూర్తి అవుతుందని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

ఆన్‌లైన్ పద్ధతిలో కాకుండా ఉద్యోగుల నుంచి ఫిజికల్‌గానే ఆప్షన్లను తీసుకోవాలన్న విషయాన్ని సీఎస్‌కు ఉద్యోగ సంఘాల నాయకులు నొక్కిచెప్పారు. సీఎస్ తో భేటీ అనంతరం గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమత మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగుల విభజన ప్రక్రియ కొత్త జిల్లాలు, కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా జరిగిన తర్వాత ఖాళీలపై స్పష్టత వస్తుందని, దానికి అనుగుణంగా వెంటనే భర్తీ ప్రాసెస్ మొదలుపెట్టాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు తెలిసిందన్నారు. విభజన ప్రక్రియలో భాగంగా ఉద్యోగుల సీనియారిటీ కీలకంగా తీసుకుంటారని, లోకల్ కేడర్‌కు అనుకూలంగానే విభజన జరుగుతుందని చెప్పారు. చాలా కాలంగా ఆందోళనలో ఉన్న ఉద్యోగులకు ఒకింత క్లారిటీ వచ్చిందన్నారు. ఎంప్లాయీస్ కు నష్టం జరగకుండానే ముగించనున్నట్లు సీఎస్ హామీ ఇచ్చారని తెలిపారు. ఈ నెలలోనే ఉద్యోగుల నుంచి ఫిజికల్ పద్ధతిలో ఆప్షన్ల సేకరణ ఉంటుందన్నారు.

సొంత జిల్లాలకే ప్రాధాన్యత

పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న 33 జిల్లాల ప్రాతిపదికనే ఉద్యోగుల విభజన ఉంటుందని, స్థానిక అభ్యర్థులతోనే ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రభుత్వం భావించినందున ఇప్పుడు విభజన ప్రక్రియ కూడా అదే తీరులో ఉంటుందని తెలంగాణ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ తెలిపారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి తమ నుంచి కూడా సీఎస్ కొన్ని సూచనలు, సలహాలు తీసుకున్నారని తెలిపారు. ఏ ఉద్యోగికీ నష్టం జరగకుండా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ఏ జిల్లా ఉద్యోగిని ఆ జిల్లాలోనే సర్దుబాటు చేయాలని చెప్పామన్నారు. భార్యాభర్తలు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కులాల ఉద్యోగులకు రోస్టర్ విధానం పాటించాలని కోరామన్నారు.

విభజన కోసం జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలు : సీఎస్

జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ప్రాతిపదికన ఉద్యోగుల విభజన జరుగుతుందని, రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు జాబితా ఖరారవుతుందని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. దానికి సంబంధించి ఉద్యోగ సంఘాల ప్రతినిధుల నుంచి కూడా అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలను పునర వ్యవస్థీకరించి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినందున ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కోడ్ అమలులో లేని జిల్లాలలో వెంటనే విభజన ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత కోడ్ ముగియగానే ఇతర జిల్లాల్లోనూ చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల విభజన ప్రక్రియ సాఫీగా సాగేందుకు జిల్లా, రాష్ట్రస్థాయిల్లో వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. విభజన జరిగే సమయంలో ప్రభుత్వం గుర్తించిన ఉద్యోగ సంఘాల జిల్లా కమిటీల ప్రతినిధులను కూడా ప్రక్రియ సాఫీగా జరిగేందుకు ఆహ్వనిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో 22వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీలు, త్వరలోనే నోటిఫికేషన్

Advertisement

Next Story