ప్రచారానికి తెర.. ఊపందుకున్న ప్రలోభాలు

by Shyam |   ( Updated:2021-04-27 05:10:33.0  )
ప్రచారానికి తెర.. ఊపందుకున్న ప్రలోభాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీల్లో పార్టీల ప్రచారం ముగిసింది. దీంతో ఓటర్లను ఎలా ఆకర్షించాలనే పనిలో పడ్డాయి ప్రధాన పార్టీలు. వారిని ఆకర్షించేందుకు ప్రలోభాలకు దిగేందుకూ వెనుకాడటం లేదు నేతలు. ఈ ప్రాంతాలే కాక అనివార్య కారణాల వల్ల ఖాళీలు ఏర్పడిన పలు మున్సిపాలిటీల్లోని 8 వార్డులతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని 18వ వార్డు లింగోజిగూడ డివిజన్ లోనూ ప్రలోభాల పర్వానికి తెరలేపుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీల నేతలు పోటీ పడుతున్నారు. సంఘాల వారీగా ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు.

సంఘాల వారీగా మందు పంపిణీ

ఈ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీల నేతలు సంఘాల వారీగా మందు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఓటర్లకు సంఘాల వారీగా, కులాల వారీగా వర్గీకరించి మందు పార్టీలు ఇచ్చిన నేతలు ఈసారి రూట్ మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఓటర్లకు నేరుగా మద్యం పంపిణీ చేసి ఓటర్లను ఆకర్షించేలా ప్రయత్నాలు మొదలెడుతున్నట్లు సమాచారం. దీని ద్వారా కరోనా నుంచి ప్రజలను రక్షించినట్లుగా బిల్డప్ లు ఇస్తూ ఓటర్లలో సింపతిని క్రియేట్ చేసి ప్రలోభాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

అభ్యర్థులు ఫుల్ బిజీ..

గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు ఐదు మున్సిపాలిటీల్లో ఆయా పార్టీల నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులు ఫుల్ బిజీ అయిపోయారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇందుకు వార్డుల వారీగా ముఖ్య నాయకులతో ఎప్పటికప్పడు టచ్ లో ఉంటూ వారికి మద్దతుగా నిలిచిన వారెందరు. బయట ఉన్న ఓట్లెన్ని వంటి వివరాలు తెలుసుకుంటున్నారు. అంతేకాదు వారిని ఓటేసేందుకు తీసుకువచ్చేలా చూడాలని వార్డుల్లోని ముఖ్య నేతలతో పాటు సంఘాల లీడర్లకు ఫోన్ లో టచ్ లో ఉంటున్నారట. బాబ్బాబు మాకే ఓటేయండి అంటూ అభ్యర్థిస్తూ ఫుల్ బిజీ అయిపోయారట.

నేతల పోటాపోటీ

ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు ప్రధాన పార్టీల నేతలు పోటాపోటీగా రంగంలోకి దిగుతున్నారు. గెలుపు జెండా ఎగురవేయాలని అధికార పార్టీ టీఆర్ఎస్ చూస్తోంది. కాంగ్రెస్ కూడా ఎలాగోలా గెలుపు తీరానికి చేరాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇక బీజేపీనాథులు ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ సీన్ ను తిరిగి రిపీట్ చేసి కారును ఓడించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఇందుకు ఓటర్లను ఆకర్షించే పనిలో ఈ ప్రధాన పార్టీలు తలమునకలై పనిచేస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో గెలుపు తీరానికి చేరేదెవరో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story