పెన్షన్ల కోసం పండుటాకుల పడిగాపులు

by Aamani |   ( Updated:2021-02-08 21:47:26.0  )
పెన్షన్ల కోసం పండుటాకుల పడిగాపులు
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆసరా పింఛన్లపై సర్కారు నిర్లక్ష్యం చూపుతోంది. రెండున్నరేళ్లుగా పింఛన్ల కోసం పండుటాకులకు పడిగాపులు తప్పడం లేదు. కొత్త పింఛన్ల విషయంలో సర్కారు స్పందించకపోగా, కొత్త దరఖాస్తుదారులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్నారు. ఎన్నికలకు ముందు నుంచి ఒక్క ఆసరా పింఛన్ మంజూరు కాకపోగా, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందరికీ పింఛన్లు వస్తాయని భావించిన వారికి నిరాశే మిగిలింది. రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా.. లబ్ధిదారులకు నిరీక్షణ తప్పడం లేదు. మరోవైపు 57 ఏళ్లు పూర్తయిన వారికి పింఛన్ల మంజూరు విషయంలో ఇప్పటికీ మోక్షం లేకపోవడంతో రెండేళ్లుగా ఎదురుచూపులు తప్పడం లేదు. తెలంగాణలో టీఆర్ ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రాకముందు నుంచీ కొత్త పింఛన్ల మంజూరు నిలిచిపోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గతంలో సుమారు ఆరు లక్షల వరకు ఆసరా పింఛన్లు ఉండగా, కొత్తగా మరో 20 వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి.

ఉమ్మడి జిల్లాలో 20 వేలు..

ప్రతి నెల కొత్త దరఖాస్తులు వస్తున్నా మండల, జిల్లా స్థాయిలోనే దరఖాస్తులు అనుమతితోనే ఆగిపోతున్నాయి. కమిషనర్ స్థాయిలో అనుమతి ఇవ్వకపోవడంతో రెండున్నరేళ్లుగా వాటికి మోక్షం లభించడం లేదు. నిర్మల్ జిల్లాలో 2019 జూన్ వరకు 2,911 దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా, 2020 జనవరి నుంచి 2021 ఫిబ్రవరి వరకు మరో 2 వేల వరకు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఒక్క నిర్మల్ జిల్లాలోనే 5 వేల వరకు దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 20 వేలకు పైగా ఉన్నాయి.

మరోవైపు 57 ఏళ్లు దాటిన వారికి కూడా పింఛన్లు ఇస్తామని ప్రకటించిన తెలంగాణ సర్కారు ఎన్నికల ఓటరు జాబితా ఆధారంగా లబ్ధిదారులను గుర్తించారు. ఒక్క నిర్మల్ జిల్లాలోనే 18,815 మంది 57 ఏళ్ల వయస్సు ఉన్న వారు ఉండగా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 60 వేల మంది వరకు ఉన్నారు. గతంలో 65 ఏళ్ల వయసు ఉన్నవారికే పింఛన్లు ఇవ్వగా.. తాజాగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తెలంగాణ సర్కారు 57 ఏళ్లకు ఇస్తామని ప్రకటించింది. రెండున్నరేళ్లుగా అమలుకు నోచుకోకపోవడంతో లబ్ధిరులు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సమయంలో తమ వైపు తిప్పుకునేందుకు పార్టీలు హామీల వర్షం కురిపించగా.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసేందుకు తిరకాసు పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

పట్టించుకునే వారే లేరు..

పింఛన్లు గతంలో రూ.వెయ్యి ఉండగా.. దివ్యాంగులకు రూ.1500 చొప్పున ఇచ్చేవారు. తెలంగాణ సర్కారు రెండో సారి అధికారంలోకి వచ్చాక రూ.2016 ఇస్తుండగా.. దివ్యాంగులకు రూ.3016 చొప్పున ఇస్తున్నారు. వృద్ధులు, వితంతువులు, ఇతర లబ్ధిదారులు మున్సిపాలిటీ కార్యాలయాల చుట్టూ తిరిగినప్పటికీ వాళ్ల గోడును పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అప్లికేషన్ మాత్రం కుప్పలు తెప్పలుగా వస్తున్నప్పటికీ అధికారులు వాటిని తీసుకొని డీఆర్డీవో కార్యాలయాలకు పంపిస్తున్నారు. ఆసరా నూతన లబ్ధిదారులకు పింఛన్ రాకపోవడంతో అధికార కౌన్సిలర్, సర్పంచులు, ఎంపీటీలల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అర్హత ఉన్న వృద్ధులు, వితంతువులు ప్రజాప్రతినిధులు వారి వారి గ్రామాలు, పట్టణాలు, వార్డుల్లో పర్యటిస్తున్న సమయాల్లో వారిని నిలదీస్తున్నారు. ఈ విషయంలో ప్రజలకు సమాధానం చెప్పలేక ప్రజా ప్రతినిధులు కూడా వారి వారి నాయకుల వద్ద గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని అర్హులందరికీ పింఛన్లు అందేలా చొరవ చూపాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.

Advertisement

Next Story