బంగారు వర్ణంలో ‘ఈఫిల్ టవర్’

by Sujitha Rachapalli |
బంగారు వర్ణంలో ‘ఈఫిల్ టవర్’
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పర్యాటక ప్రదేశాల్లో ‘ఈఫిల్ టవర్’ పేరు టాప్‌లో ఉంటుంది. 1889లో దీనిని స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు ఇరవై కోట్లకు పైగానే దీన్ని సందర్శించారు. దాంతో ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువ మంది పర్యటించిన పర్యాటక స్థలంగా చరిత్రలో నిలిచింది. ఈ టవర్‌కు వాడిన లోహాలు తుప్పు పట్టకుండా ఉండేందుకు ప్రతి ఏడేళ్ల కొకసారి పెయింట్ వేస్తుంటారు. అందుకోసం దాదాపు 50 నుంచి 60 టన్నుల పెయింట్ వాడుతారు. భూమ్మీద నుంచి వీక్షకుడు సమదృష్టితో చూడ్డానికి మూడు రకాలైన రంగులను టవర్ పెయింటింగ్‌కి ఉపయోగిస్తారు. ఈ ఫేమస్ ఐకాన్ ఇప్పుడు బంగారు వర్ణంలో మరింత మందిని ఆకర్షణించబోతున్నది. 2024 ఒలంపిక్స్ ఈ సారి పారిస్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈఫిల్ టవర్‌‌ను ‘గోల్డ్’ రంగుతో మేకోవర్ చేయనున్నారు.

ఏటా కనీసం 70 లక్షల మంది టూరిస్టులు ఈఫిల్‌ టవర్‌ని సందర్శిస్తుండగా, ఫ్రాన్స్‌ దేశానికే తలమానికంగా నిలిచిన ఈ టవర్‌ని 1889లో నిర్మించారు. ఈఫిల్ టవర్ మొత్తం బరువు 10,000 టన్నులు. ఇందులో లోహపు బరువు 7,300 టన్నులు. 324 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ టవర్‌ను ఇప్పటి వరకు 19 సార్లు పెయింట్ చేయగా, ప్రత్యేకంగా రూపొందించిన షేడ్ ఆఫ్ బ్రౌన్ పెయింట్ చేశారు. ప్రజెంట్.. దీనిని పసుపు-గోధుమ రంగులో చిత్రించడానికి సిద్ధం చేస్తున్నారు. న్యూ షేడ్ కలర్ ఈ ఐకానిక్ టవర్‌ బంగారు రంగుతో మరింత ప్రకాశవంతంగా మెరిసిపోతుందని నిర్వాహకులు చెప్తున్నారు. ఈఫిల్ టవర్ మేకోవర్ ఖర్చు సుమారు 60 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా. 2019లో మొదలైన పెయింటింగ్ వర్క్ 2022లో పూర్తవుతుంది.

ఈఫిల్ టవర్ డిజైనర్ గుస్టావ్ ఈఫిల్ అభ్యర్థన మేరకు మొదట నిర్మించినప్పుడు దీనికి ఎరుపు రంగులో పెయింట్ వేయగా, మూడేళ్ల తర్వాత దాని రంగు ఓచర్ లేదా లేత నారింజ రంగులో పెయింట్ చేశారు. ఈ రంగు 1907 నుంచి 1954 వరకు 47 ఏళ్లు ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత 1968లో గోధుమ-ఎరుపు కలర్‌లో పెయింట్ వేశారు. దీనిని రూపొందించిన ఇంజినీరు ‘గుస్టావ్ ఈఫిల్’ పేరు మీదుగా దీనికి ‘ఈఫిల్ టవర్’ అని పేరు రాగా, దీనిని నిర్మించే సమయంలో 72 మంది ఫ్రెంచి శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ఇతర ప్రముఖుల పేర్లు దీనిపై ఈఫిల్ రాయించారు.

Advertisement

Next Story

Most Viewed