సహకరించని ‘ధరణి’

by Shyam |   ( Updated:2020-11-12 23:30:09.0  )
సహకరించని ‘ధరణి’
X

దిశ, తెలంగాణ బ్యూరో: మూడేండ్ల కష్టార్జితంతో రూపొందించిన ‘ధరణి’ పోర్టల్ లో సమగ్రత లోపించింది. మధ్యంతర ఉత్తర్వులు ఎన్ని జారీ చేసినా లోపాలు కనిపిస్తూనే ఉన్నాయి. సమస్యలపై సమగ్ర అధ్యయనం చేయకుండానే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అవుతున్నాయి. వాటిని అమలు చేయలేక ఉద్యోగులు సతమతమవుతున్నారు. ఏజీపీఏ, జీపీఏల సంగతేమిటో తెలియక అయోమయానికి గురవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవి వేల సంఖ్యలో ఉన్నాయి. ధరణి ఆధారిత రిజిస్ట్రేషన్లు, ఆటోమెటిక్ మ్యూటేషన్లతో చిక్కుముడులు పెరిగిపోతున్నాయి. పట్టాదారు పాస్​ పుస్తకాలు ఉంటే తప్ప మరొకరికి విక్రయించే వెసులుబాటు లేదు.

ఏజీపీఏ, జీపీఏ చేయించుకున్న కొనుగోలుదారులకు, హక్కుదారులకు కనీసం మ్యూటేషన్ చేయించుకునే అధికారం, హక్కులు లేవు. వారి పేర్లు ధరణిలో నమోదుకు నోచుకోలేదు. పాత హక్కుదారుల పేర్లే నమోదు చేశారు. ఏయే భూములు ఏజీపీఏ చేశారో కూడా రెవెన్యూ అధికారులకు తెలియదు. ఆ సమాచారం కూడా తహసీల్దార్ల దగ్గర లేదు. ఏజీపీఏల సమాచారం సేల్ డీడ్లలోనే నిక్షిప్తమై ఉంటుంది. అంటే సబ్ రిజిస్ట్రార్లకు మాత్రమే తెలుసు. ఈ పాత హక్కుదారులు మరోసారి భూములు విక్రయిస్తే అడ్డుకునే వ్యవస్థ లేదు. తెలిసినా అడ్డుకునే అధికారం తహసీల్దార్లకు లేకుండా చేశారు. విచక్షణాధికారాలన్నీ రద్దయ్యాయి. సీఎంఓ ఉన్నతాధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, సీసీఎల్ఏ అధికారులకు చెప్పినా ఫలితం లేదంటున్నారు. ఆలస్యం చేస్తే రూ.లక్షలు, రూ.కోట్లు విలువజేసే ఆస్తులకు సంబంధించిన వివాదాలు పెరుగుతాయని ఉద్యోగులు చెబుతున్నారు.

రియల్టర్లే అధికం
రెండు దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. కొందరు సాగు భూములను యథాతథంగా, ఇంకొందరు ప్లాట్లుగా చేసి విక్రయించడం పరిపాటి. రైతుల నుంచి ఏజీపీఏ లేదా జీపీఏ చేసుకొని ఇతరులకు అమ్మడం ఆనవాయితీ. ధరణి పోర్టల్ రాకముందు ఈ వ్యవహారాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా సాగాయి. ఇప్పుడేమో వారు అమ్మేందుకు హక్కులు లేకుండా చేసేశారు. ఎవరు భూములు అమ్మినా వారికి కొత్త పట్టాదారు పాస్​ పుస్తకం ఉండాలి. అంటే మళ్లీ తమకు అమ్మిన రైతుల దగ్గరికి వెళ్లి మరోసారి సంతకాలు చేయించాలి. వారు తహసీల్దార్ దగ్గరికి వచ్చి అమ్మానంటూ చెప్పాలి. ఏనాడో అమ్మినవారిని మళ్లీ సంప్రదించాలంటే కష్టమే. పేచీ పెట్టే అవకాశాలు ఉన్నాయని రియల్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు అమ్మినవారికి పట్టాదారు పాస్​ పుస్తకమే లేకపోతే, ఏజీపీఏ, జీపీఏదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. అమ్మినవారికి పాస్ పుస్తకం ఉంటే కొన్నవారికి హక్కులు లభిస్తున్నాయి. ధరణికి ముందే కొనుగోలు చేసినవారికి కష్టాలు తప్పేటట్లు లేవు. ఏజీపీఏ, జీపీఏదారులకు కాస్త సమయం ఇచ్చిన తర్వాత ధరణి రిజిస్ట్రేషన్లను అమల్లోకి తీసుకొస్తే బాగుండేదంటున్నారు.

ఏజీపీఏ, జీపీఏ
ఏజీపీఏ అంటే యజమానికి పూర్తిగా డబ్బులు చెల్లిస్తారు. ఆరు శాతం స్టాంపు డ్యూటీ కడతారు. ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అవుతుంది. రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కదు. జీపీఏ అంటే యజమాని భూమిని అమ్మేందుకు ఓ ఏజెంటును నియమించుకుంటారు. యజమాని చనిపోతే జీపీఏ రద్దవుతుంది. ఒకశాతం మాత్రమే స్టాంపు డ్యూటీ చెల్లిస్తారు. అమెరికాలాంటి దేశాల్లో యజమాని సొంతంగా విక్రయించడానికి వీల్లేదు. ఎవరికైనా అధికారం కట్టబెట్టాలి. ఇక్కడా అలాంటి ప్రత్యామ్నాయ వ్యవస్థగా ఏజీపీఏ, జీపీఏ ఉండేది. ఇప్పుడది ఉనికిని కోల్పోయిందని ఓ సబ్ రిజిస్ట్రార్ అన్నారు.

డిక్రీ అమలుకూ ‘నో’
కొత్త చట్టం ప్రకారం ఏదైనా కోర్టు తీర్పు, డిక్రీ, ఉత్తర్వును ఆదేశాలను అమలు చేయాలి. వాటి ప్రకారం హక్కులు కల్పించాలి. ధరణి పోర్టల్ లో నమోదు చేయాలి. వాటిని అమలు చేసేందుకు కూడా పోర్టల్ సాంకేతికత సహకరించడం లేదని ఓ డిప్యూటీ కలెక్టర్ ‘దిశ’కు వివరించారు. తహసీల్దార్ ప్రయత్నించినా కుదరడం లేదు. దానికి కూడా పాత హక్కుదారుల పట్టాదారు పాస్​ పుస్తకం నమోదు చేయాలి. వివాదాస్పద భూములకు పాస్​ పుస్తకాలు జారీ కాలేదు. ఈ క్రమంలో కోర్టు డిక్రీ అమలు కూడా ఇబ్బందిగా మారిందంటున్నారు.

Advertisement

Next Story