కామారెడ్డిలో ప్రొఫెసర్ జయశంకర్‌ అంటే గౌరవం లేదా..?

by Aamani |   ( Updated:2021-06-21 04:00:05.0  )
కామారెడ్డిలో ప్రొఫెసర్ జయశంకర్‌ అంటే గౌరవం లేదా..?
X

దిశ, కామారెడ్డి: తెలంగాణ ఉద్యమం రథసారథి ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి నేడు. ఆయనను గుర్తు చేసుకుని నివాళులర్పించాల్సిన రోజు ఇది. ఆయనను గుర్తు చేసుకోవడం మాట పక్కనపెడితే కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ కాలానికి జయశంకర్ కాలనీ అని పేరు పెట్టారు. కాలనీకి వెళ్లే దారిలో ఓ గద్దె నిర్మించి దానిపై జయశంకర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. గత కొద్దిరోజులుగా ఆ కాలనీ నుంచి గుమస్తా కాలనీ వరకు రహదారి నిర్మించారు. దాంతో వాహనాల రాకపోకలతో ఆ కాలనీ రోడ్డు ధ్వంసమైంది. సార్ విగ్రహం ఏర్పాటు చేసిన గద్దె బీటలు వారింది.

ఆకతాయిలు చేసారా లేక అనుకోకుండా జరిగిందా తెలియదు గాని జయశంకర్ విగ్రహం ముక్కు ధ్వంసమైంది. ధ్వంసమై నెలలు గడుస్తున్నా దానిని బాగు చేసేవారే కరువయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎనలేని కృషి చేసి చివరికి స్వరాష్ట్రాన్ని కళ్లారా చూడకుండానే కన్నుమూసిన సార్ కు ఇచ్చే గౌరవం ఇదేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇతర ఏ విగ్రహాలు ధ్వంసం అయినా ధర్నాలు రాస్తారోకోలు చేసి నానా రాద్ధాంతం చేసే వారు ఇప్పుడెక్కడున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా అధికారులు గాని, నాయకులు గాని స్పందించి పటిష్టమైన గద్దె ఏర్పాటు చేయడంతో పాటు పాక్షికంగా ధ్వంసమైన విగ్రహాన్ని బాగు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed