- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘స్పోర్ట్స్ క్లబ్’కు గ్రీన్ సిగ్నల్
దిశ, వరంగల్ తూర్పు: వరంగల్ మహా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటుకు కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.5కోట్ల వ్యయంతో నగరంలోని 6వ డివిజన్‌లో దీనిని ఏర్పాటు చేసేందుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. కౌన్సిల్ సమావేశంలోనే రైఫిల్ షూటింగ్‌పై డెమో ఇవ్వడం పలువురిని ఆకట్టుకుంది. మేయర్, కమిషనర్ రైఫిల్ ఎక్కుపెట్టి డెమోను ప్రారంభించారు. వరంగల్ మహా నగరపాలక సంస్థ పాలకమండలి సర్వసభ్య సమావేశం హన్మకొండలోని అంబేద్కర్ భవన్‌లో మేయర్ గుండా ప్రకాశ్‌రావు అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా 119 అంశాల్లో చేపట్టిన 380 పనులకు సభ ఎలాంటి చర్చ నిర్వహించకుండానే ఆమోదముద్ర వేశారు. వీటికి గాను రూ.155.11 కోట్లకు పరిపాలన పరమైన మంజూరు ఇచ్చారు. ఇందులో రూ.23.15కోట్లను టేబుల్ ఎజెండాగా ఆమోదించారు.
ముందుకు రాని కాంట్రాక్టర్లు..
పలు అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపినా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంపై పలువురు కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు ఫోన్ చేసినా వారు కూడా సిబ్బంది తక్కువ ఉంది. మేము ఏమి చేయలేమంటూ చేతులెత్తుతున్నారని ఆరోపించారు. దీంతో డివిజన్‌లో తిరుగలేకపోతున్నామని వాపోయారు. ఈ విషయంలో మేయర్, కమిషనర్ చొరవ చూపాలన్నారు. పనులు ముందుకు సాగకపోవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు, కాంట్రాక్టర్లతో కలిపి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ గుంతలతోనూ స్థానికంగా ఇబ్బందులు తప్పడం లేదని పలువురు కార్పొరేటర్లు కౌన్సిల్ దృష్టికి తీసుకుపోయారు. ఎన్నిసార్లు చెప్పినా ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారని, తీసిన గుంతలను వారం, పది రోజులైనా పూడ్చడం లేదని ఆరోపించారు. ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు కఠినంగా వ్యవహరించాలని, వాటిని వినియోగిస్తున్నవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పలువురు కొర్పొరేటర్లు కోరారు. గుండ్ల సింగారంలోని కాకతీయ కాలువకు అడ్డుగా అనుమతి లేకుండా రెండు గృహాలు నిర్మించడంతో నీరంతా ఇళ్లలోకి వస్తుందని స్థానిక కార్పొరేటర్ ఆరోపించారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా మేయర్ సంబంధిత ఇంజనీర్ కోరగా ఆయన సంబంధం లేని విషయాలను ప్రస్తావించడంతో మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు చేయడం చేతకాకుంటే లాంగ్ లీవ్ పెట్టి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు.
సైకిల్‌పై వచ్చిన వినయభాస్కర్
ప్రభుత్వ చీఫ్‌విప్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ సైకిల్‌పై కౌన్సిల్ సమావేశానికి హాజరు కావడం అందరినీ ఆకట్టుకుంది. సమావేశంలోనూ కాలుష్యాన్ని తగ్గించేందుకు అందరూ విరివిగా సైకిల్ ఉపయోగించాలని సూచించడంతోపాటు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బల్దియా చర్యలు చేపట్టాలని కోరారు. తమ ప్రసంగం ముగిసిన వెంటనే పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి చేరో సైకిల్‌పై సర్కిల్ గెస్ట్ హౌజ్‌కు వెళ్లారు.
చరిత్రలో నిలిచిపోతాం..
వరంగల్ మహా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వందల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు వాటిని పూర్తి చేసినందున ఈ పాలకవర్గం చరిత్రలో నిలిచిపోతుంది. కేవలం 11నెలల్లోనే పూర్తయిన పనులకు రూ.300కోట్లు చెల్లించాం. ప్రస్తుతం నిధుల కొరత లేదు. పనులు వెంటనే పూర్తి చేయండి. దీనికోసం కార్పొరేటర్లు తమవంతు చొరవ చూపాలి.
-మేయర్ గుండా ప్రకాశ్‌రావు
నవ్య, భవ్య నగరంగా చేద్దాం..
వరంగల్ నగరాన్ని నవ్య, భవ్య నగరంగా చేద్దాం.. అందుకు మేయర్, కమిషనర్ కృషి చేస్తున్నారు. సైకిల్ ఫర్ చేంజ్‌కు మనమంతా చేయూత అందించాలి.. వేదిక ద్వారా విఙ్ఞప్తి చేస్తున్నా.. వచ్చే సమావేశానికి ప్రజాప్రతినిధులు, అధికారులంతా సైకిల్‌పైనే సమావేశానికి వద్దాం.. అధికారిక కార్యక్రమానికి కూడా సైకిల్ ఉపయోగించడం ద్వారా ప్రజల్లో అవగాహన కలుగుతుంది. నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా చేద్దాం. కౌన్సిల్ సమావేశంలో కూడా వాటర్ బాటిల్లను నిషేదిద్దాం.
-ప్రభుత్వ చీఫ్ విప్ వినయభాస్కర్
విలీన గ్రామాలను అభివృద్ది చేద్దాం..
సిబ్బంది కొరత కారణంగా విలీన గ్రామాల్లో పనులు ముందుకు సాగడంలేదు. కమిషనర్ కనీసం వారానికి ఒకరోజు ఈ గ్రామాల్లో పర్యటించి పనులు వేగవంతంగా జరిగేలా చూడాలి. విలీన గ్రామాల్లో పనులు నిర్వహించేందుకు అవసరమైతే డిప్యుటేషన్‌పై సిబ్బందిని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నా.
-పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
బీ3 పాటిద్దాం..
ప్రతి ఒక్కరు బీ3 ఫార్ములా పాటించి నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా మారుద్దామని కమిషనర్ పమేలా సత్పతి కోరారు. ప్రతి ఒక్కరు తాగు నీటిని (బాటిల్) ఇంటి నుంచే తెచ్చుకోవడం, వస్తువలు కొనుగోలుకు ఇంటినుంచే సంచి(బ్యాగ్) తెచ్చుకోవడం, చికెన్, మటన్ కొనుగోలుకు టిఫిన్ బాక్స్ తీసుకుపోతే ప్లాస్టిక్‌ను పూర్తి స్థాయిలో నివారించవచ్చన్నారు. దీనిని అందరూ పాటించాలని ఆమె కోరారు.
-కమిషనర్ పమేలా సత్పతి