ఆఖరి గింజ వరకు కొనాల్సిందే..వైఎస్ఆర్‌టీపీ

by Shyam |
Dvendhra reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని ఆఖరి గింజ వరకు కొనాల్సిందేనని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి తూడి దేవేందర్​రెడ్డి డిమాండ్​చేశారు. లోటస్​పాండ్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మద్దతు ధరకు, మీ పంట పొలంలోనే వడ్లు కొంటామని టీఆర్ఎస్ ప్రభుత్వం హామీనిచ్చి నేడు మాట మారుస్తోందని విమర్శించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు ఎందుకు చేస్తుందో రైతులకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. సన్న వడ్లు వేయమని చెప్పిన పాలకులే ఇప్పుడు ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
గతేడాది సన్న వడ్లు కొనకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేశాక కేంద్రంతో కొట్లాడాలని రాష్ట్రం ప్రభుత్వానికి సూచించారు. పక్క రాష్ట్రాంలో మద్దతు ధరకు మించి క్వింటాల్‌కు రూ.500 చెల్లిస్తున్నారని దేవేందర్​రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఎకరానికి సగటున 28 క్వింటాళ్ల ధాన్యం పండుతోందని, ఇతర రాష్ట్రాలకు ఇస్తున్న ధరలతో పోల్చుకుంటే తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.

ఇంటి దగ్గర ఉండాల్సిన రైతులు నిద్రాహారాలు మాని వడ్లు కొనాలని, వరి పంటను రోడ్డుపై, పంట పొలాల్లో కుప్పలుగా పోసి ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరి ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలని దేవేందర్​రెడ్డి డిమాండ్​చేశారు. అనంతరం ధాన్యాన్ని రా రైస్‌గా వాడుకుంటారనేది తర్వాత నిర్ణయించుకోవాలన్నారు. సబ్సిడీలు బంద్ చేసి రైతుబంధును మాత్రమే ఇస్తున్న సర్కార్​టీఆర్ఎస్ దేనని మండిపడ్డారు.

ఈ పంట ఒక్క రోజులో పండిన పంట కాదని, రైతులు నారు పోసిన్నాడే ప్రభుత్వానికి తెలుసని, అలాంటిది ఇప్పడు ధర్నాలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2010కి ముందు కరువు వస్తే నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు దేశానికి ధాన్యం పంపి అన్నపూర్ణలుగా నిలిచాయని గుర్తు చేశారు. మూడేళ్లుగా గోదాంలలో వడ్లు మూలుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనాలనే షర్మిల శనివారం ‘రైతు వేదన’ పేరిట నిరాహార దీక్ష చేపడుతున్నారన్నారు. 72 గంటల పాటు అనుమతి కోరినా ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఇందిరాపార్క్​వద్ద శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతు వేదన దీక్ష చేసి, అనంతరం ఆ దీక్షను లోటస్ పాండ్ లో కొనసాగిస్తారన్నారు. ఈ దీక్షకు పార్టీ అధికార ప్రతినిధులు, పార్లమెంట్​క‌న్వీన‌ర్లు, కో-క‌న్వీన‌ర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, యువ‌జ‌న విభాగం, దళిత, బీసీ, మైనారిటీ, గిరిజన విభాగం నాయ‌కులు, రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed