కేంద్రం కులగణన చేయాలి.. బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం డిమాండ్

by Shyam |
BC Commission Chairman Vakulabharanam
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం కుల గణన చేయాలని బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు డిమాండ్ చేశారు. బుధవారం ఖైరతాబాద్‌లోని తెలంగాణ బీసీ కమిషన్ కార్యాలయంలో నూతన చైర్మన్, కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్‌గా కృష్ణ మోహన్ రావు, సభ్యులుగా ఉపేంద్ర, శుభప్రద పటేల్, కిషోర్ గౌడ్‌లు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ మోహన్ బాబు మాట్లాడుతూ.. 1930-1931లో కుల జన గణన జరిగిందని, తిరిగి 2011లో యూపీఏ ప్రభుత్వం ఘనంగా చేపట్టినప్పటికీ వివరాలను గోప్యంగా ఉంచిందన్నారు. తర్వాత వేసిన కమిటీలు కూడా కుల గణన చేయాలని కోరినప్పటికీ కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టలేదని స్పష్టం చేశారు.

కులగణనతోనే అన్ని వర్గాలు సామాజిక, ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని, ఏ రంగంలో వెనుకబడి ఉన్నామో ఆ రంగాలపై దృష్టి సారించడం జరుగుతుందని వెల్లడించారు. బీసీ కమిషన్ నివేదికను అమలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. ఇతర రాష్ట్రాల్లో బీసీ కమిషన్ ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేసినట్లు పేర్కొన్నారు. మంచిని మంచే అనాలని సూచించారు. అడగకుండానే బీసీల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. బీసీ కమిషన్ ప్రజల పక్షం అని పేర్కొన్నారు. దేశ జనాభాలో 56 శాతం బీసీలు ఉన్నారని, సంక్షేమానికి సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడించారు. అందరూ బీసీ కమిషన్‌కు నేరుగా వచ్చి సమస్యలు చెప్పవచ్చని సూచించారు. త్వరలోనే క్షేత్రస్థాయిలో పర్యటన చేసి, బీసీల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed