కోడి పొడిచింది అనుకుంటే.. ప్రాణం పోయింది.. అసలేం జరిగింది..!

by Anukaran |   ( Updated:2021-07-08 04:02:03.0  )
boy1
X

దిశ, మహబూబాబాద్: ఆటలు ఆడుకుంటుండగా కోడి పొడిచిందని అనుకోని ఓ బాలుడు మృత్యువాత పడ్డాడు. సాయంత్రం తోటి స్నేహితులతో ఆటలు ఆడుకొని నిద్రలోనే ప్రాణాలు విడిచాడు. కుమారుడు కళ్లెదుటే చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బేరువాడ గ్రామానికి చెందిన ముదిగిరి రమేష్, శ్రీలత దంపతులకు ఒక్క కుమారుడు, ఒక కుమార్తె సంతానం ఉన్నారు. వీరిలో పెద్దవాడైనా ముదిగిరి అజయ్(10) బుధవారం అదే గ్రామంలో వీరి ఇంటిపక్కన బంధువుల ఫంక్షన్ కు వెళ్ళాడు. తోటి పిల్లలతో ఆటలు ఆడుకుంటూ, ఇంటి సెల్ఫ్ ను పట్టుకొని వేలాడుతున్నాడు.

అప్పటికే అ సెల్ఫ్ మీద కోడిని పొదిగేశారు. ఈ క్రమంలో ఆ సమయంలోనే పాము కాటు వేసింది. విషయాన్ని పసిగట్టని బాలుడు తల్లిదండ్రులకు కోడి పొడిచిందని స్థానిక వైద్యుని వద్ద చికిత్స అందజేశారు. చికిత్స అనంతరం కూడా బాలుడు ఆటలు ఆడుకోవడంతో తల్లిదండ్రులు సైతం శ్రద్ద చూపలేదు. సాయంత్రం అజయ్ నిద్రిస్తూ నోటిలో నుండి నూరుగు కక్కుతుండడంతో మహబూబాబాద్ కు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. గురువారం బేరువాడ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు కళ్లెదుటే మృతి చెందడం పట్ల తల్లిదండ్రులు, కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed