ప్రభుత్వంలో బీజేపీకి చోటుండదు: ఏఐఏడీఎంకే

by Shamantha N |
ప్రభుత్వంలో బీజేపీకి చోటుండదు: ఏఐఏడీఎంకే
X

చెన్నై: వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని నిలుపుకున్న కూడా తమ ప్రభుత్వంలో బీజేపీకి చోటుండదని ఏఐఏడీఎంకే ఆదివారం మరోసారి స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమికి తమ పార్టీనే సారథ్యం వహిస్తుందని ఏఐఏడీఎంకే సీనియర్ నేత, పార్టీ డిప్యూటీ కోఆర్డినేటర్ కేపీ మునుసామి చెప్పారు. ద్రవిడులకు కేంద్రమైన తమిళనాడులో కాషాయ పార్టీ అధికారాన్ని చేపట్టబోదని స్పష్టం చేశారు. ఎన్‌డీఏ కూటమి నుంచి సీఎం అభ్యర్థిగా పళనిస్వామికి ఆమోదం తెలుపడంతోపాటు ఒకవేళ కూటమి మెజార్టీ సాధించినప్పటికీ ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని ఆశించదన్న షరతులను బీజేపీ అంగీకరించాల్సి ఉన్నది. ఈ షరతులను అంగీకరించకుంటే బీజేపీ పునరాలోచించుకోవచ్చునని మునుసామి అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల కోసం ఏఐఏడీఎంకే ఇక్కడ తొలి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్ర సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పనీర్‌సెల్వంల సమక్షంలోనే మునుసామి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జయలలిత, కరుణానిధిలు కన్నుమూయడంతో రాష్ట్రంలో రాజకీయపట్టుకోసం అవకాశవాదులు, జాతీయ పార్టీలు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ద్రవిడ పార్టీల 50ఏళ్ల పాలనతో తమిళనాడును నాశనం చేశారని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఏఐఏడీఎంకే సుపరిపాలనపై కేంద్రప్రభుత్వమే అవార్డులనిచ్చిందని, అలాంటప్పుడు నిర్హేతుకమైన ఆరోపణలు చేయడం దారుణమని ఆగ్రహించారు. వారు ద్రవిడ భావజాలానికి బయటివారని ప్రజలు సులువుగానే గుర్తుపడతారని హెచ్చరించారు. రాష్ట్రంలో బిగ్ బ్రదర్ ఏఐఏడీఎంకేనని, ప్రభుత్వంలో భాగస్వామ్యం కూడదని బీజేపీకి అధికార పార్టీ విస్పష్టం చేసింది. అంతేకాదు, ద్రవిడ సిద్ధాంతానికి కేంద్రకమైన తమిళనాడులో బీజేపీ సొంతంగా నిలబడలేదని, ఏఐఏడీఎంకేపై ఆధారపడక తప్పదన్న సంకేతాలను పరోక్షంగా ఇచ్చినట్టయింది.

Advertisement

Next Story

Most Viewed