జనవరిలో భారత్‌కు రానున్న టెస్లా కారు!

by Harish |   ( Updated:2020-12-28 08:14:56.0  )
జనవరిలో భారత్‌కు రానున్న టెస్లా కారు!
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజ సంస్థ టెస్లా భారత్‌కు రానుంది. ఈ మేరకు 2021, జనవరిలో భారత్‌లో కార్యకలాపాలను టెస్లా ప్రారంభించనున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం స్పష్టం చేశారు. టెస్లా తన మోడల్ 3 కార్లను వచ్చే ఏడాది జూన్ నాటికి డెలివరీలను ప్రారంభించనుంది. వచ్చే ఐదేళ్లలో భారత్ ఆటో రంగంలో నంబర్ వన్ తయారీ కేంద్రంగా ఉంటుందని గడ్కరీ చెప్పారు. దేశీయంగా ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోందని, ప్రజల వినియోగానికి తగిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి చాలా కంపెనీలు పనిచేస్తున్నాయని గడ్కరీ తెలిపారు.

టెస్లాతో పాటు మరిన్ని ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ముందుగా టెస్లా భారత మార్కెట్లోకి అమ్మకాలను ప్రారంభిస్తుందని, భవిష్యత్తులో అసెంబ్లింగ్, తయారీని చేపడుతుందని గడ్కరీ వివరించారు. కాగా, ఇదివరకు అక్టోబర్ నెలలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, 2021లో టెస్లాను భారత్ మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో 2021కి టెస్లా మోడల్ 3 కారు విదేశాల్లో తయారై భారత మార్కెట్లోకి రానుంది. అంతేకాకుండా టెస్లా డీలర్‌షిప్‌ల నుంచి కాకుండా నేరుగా విక్రయించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story