ఉప్పల్‌లో ఉద్రిక్తత.. రోడ్డు ప్రమాదంలో ఈటల అభిమాని మృతి

by Anukaran |
Etela rajender, road accident
X

దిశ, క‌మ‌లాపూర్: హ‌న్మకొండ జిల్లా క‌మ‌లాపూర్ మండ‌లం ఉప్పల్ గ్రామంలోని భీంప‌ల్లి క్రాస్ రోడ్డు వ‌ద్ద జ‌రిగిన రోడ్డు ప్రమాదంలో బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్ అభిమాని నాగుర్ల రాజేంద‌ర్ అక్కడికక్కడే మృతి చెందాడు. దేశ‌రాజుప‌ల్లి గ్రామానికి చెందిన రాజేంద‌ర్(30) ఆటో న‌డుపుకుంటూ జీవ‌నం సాగిస్తున్నాడు. సోమ‌వారం సాయంత్రం జ‌మ్మికుంట నుంచి ప్రయాణికుల‌ను తీసుకొస్తుండ‌గా భీంప‌ల్లి క్రాస్ రోడ్డు వ‌ద్ద ఓ టీఆర్ఎస్ నేత వాహ‌నం ఢీకొట్టిన‌ట్లుగా స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌లో రాజేంద‌ర్ అక్కడికక్కడే మృతిచెందాడు. రాజేంద‌ర్ మృత‌దేహంతో స్థానిక బీజేపీ నేత‌లు, ఈటల అభిమానులు, మృతుడి కుటుంబ స‌భ్యులు రోడ్డుపై ధ‌ర్నా చేశారు. రాజేంద‌ర్‌ను ఢీకొట్టిన కారులో పెద్ద మొత్తంలో న‌గ‌దు కూడా ఉన్నట్లుగా బీజేపీ నేత‌లు ఆరోపించారు. అత్యంత వేగంతో కారు న‌డిపి ఆటో డ్రైవ‌ర్ ప్రాణాల్ని బ‌లి తీసుకున్నట్లుగా బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

Etela rajender, road accident

ప్రస్తుతం ఉప్పల్‌లో హై టెన్షన్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్‌, మాజీ ఎంపీ వివేక్‌తో పాటు మ‌రికొంత‌మంది బీజేపీ నేత‌లంతా సంఘ‌ట‌నా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. అన్ని విధాలుగా కుటుంబాన్ని ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు. రాజేంద‌ర్‌కు భార్య, ఏడాది కొడుకు ఉన్నాడు. ఇదిలా ఉండ‌గా అంత‌కుముందు ఉప్పల్‌లో హై టెన్షన్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే త‌మ్ముడి కారు రాజేంద‌ర్ ఆటోను ఢీకొట్టిన‌ట్లుగా ప్రచారం జ‌ర‌గ‌డంతో రాజ‌కీయ వేడి పెరిగింది. పోలీసులు పెద్ద ఎత్తున ఉప్పల్‌లో మోహరించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

క‌మిష‌న‌ర్ వివ‌ర‌ణ‌

సోమ‌వారం సాయంత్రం 6.30 గంటలకు కమలాపూర్ మండలంలోని ఉప్పల్ భీంపల్లి క్రాస్ వద్ద కారు, ఆటో మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎలాంటి రాజ‌కీయ కోణాలు లేవ‌ని సీపీ త‌రుణ్ జోషి స్పష్టం చేశారు. ఈ మేర‌కు సోమ‌వారం రాత్రి ఆయ‌న ఒక ప్రక‌ట‌న విడుద‌ల చేశారు. ఇది పూర్తిగా ప్రమాద‌వ‌శాత్తు జ‌రిగిన‌ రోడ్డు ప్రమాదని అన్నారు. కరీంనగర్ ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్ గుండెపు తిరుపతి భూపాలపల్లిలో జరిగిన శుభకార్యానికి హాజ‌రై తిరిగి వెళ్తున్న క్రమంలో ఉప్పల్ గ్రామ ప్రధాన రోడ్డు మార్గంలో భీంపల్లి క్రాస్ వద్ద కారు, ఆటో ఢీ కొన్న సంఘటనలో ఆటో డ్రైవర్ మరణించడం జరిగింది. పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో పూర్తిగా రోడ్డు ప్రమాదంగా నిర్థారించడమైనద‌ని అన్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, కారు డ్రైవర్‌ను అరెస్టు చేయడం జరగింద‌ని తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి కారు యజమాని మరియు కారు డ్రైవర్‌కు ఏ పార్టీతో సంబంధాలు లేవని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ప్రకటించారు.

Advertisement

Next Story