- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏజెన్సీలో టెన్షన్
కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతంలో ఒక వైపు మావోయిస్టుల కదలికలు, మరో వైపు పోలీసుల కూంబింగ్ కొనసాగుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక టెన్షన్ వాతావరణం నెలకొంది. చర్ల మండలంలో అభివృద్ధి పనులు చేపడుతున్న వాహనాలను సైతం మావోయిస్టులు ధ్వంసం చేశారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకే రోజున రెండు ప్రాంతాల్లో… మణుగూరు మండలంలో మావోయిస్టులకు, కూంబింగ్ బృందాలకు ఎదురు కాల్పులు జరగడంతో పాటు పినపాక కరకగూడెం మండలాల్లోని ఏజెన్సీలో కాల్పులు చోటుచేసుకోవడం గమనార్హం.
దిశ ప్రతినిధి, ఖమ్మం: అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ వైపు మావోయిస్టుల కదలికలు పెరగడం… మరో వైపు పోలీసుల కూంబింగ్ నిర్విరామంగా కొనసాగుతుండటంతో ఎప్పడు ఏం జరుగుతుందోననే ఆందోళనకర వాతావరణం నెలకొంది. విచారణ పేరుతో పోలీసులు కొంతమంది గిరిజనులను, మావోయిస్టు సానుభూతిపరులుగా అనుమానిస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. మాజీలపైనా దృష్టి పెడుతున్నారు. వారి కదలికలపై ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా కొంతకాలంగా ఏజెన్సీ మండలాల్లో కదలికలు పెరిగాయని ఇటీవల జరిగిన ఎదురు కాల్పులు, మావోయిస్టుల విధ్వంస చర్యలతో స్పష్టమవుతోంది.
ఉదయం మణుగూరులో.. సాయంత్రం పినపాకలో..
కొద్ది రోజుల క్రితం మణుగూరు మండలంలో ఉదయం పూట మావోయిస్టులకు, కూంబింగ్ బృందాలకు ఎదురు కాల్పులు జరిగాయి. అదే రోజూ సాయంత్రం పినపాక కరకగూడెం మండలాల్లోని ఏజెన్సీలో కాల్పులు చోటు చేసుకున్నాయి. నాలుగైదు రోజుల వ్యవధిలోనే చర్ల మండలం రోడ్డు అభివృద్ధి పనులు నిర్వహిస్తున్న రెండు చోట్ల యంత్రాలను దహనం చేసేశారు. దీంతో మావోయిస్టుల యాక్షన్‌టీంను పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మావోయిస్టులు సంచరిస్తున్నారనే అనుమానంతో 2000 మందికి పైగా పోలీసులు, మూడు జిల్లాల సరిహద్దుల అడవుల్లో గాలింపు చేపట్టారు.
నెల రోజుల క్రితం సామగ్రి స్వాధీనం
మావోయిస్టు అగ్రనేతలైన బడే చొక్కారావు అలియాస్ దామోదర్, భద్రు దళాలు ఛత్తీస్‌గఢ్ నుంచి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల సరిహద్దు అడవుల్లో సంచరిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి, ఇల్లెందు, పినపాక, కరకగూడెం, ఆశ్వాపురం, పాల్వంచ అడవుల్లో మావోయిస్టుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు. సరిగ్గా నెల రోజుల క్రితం కరకగూడెం మండలంలోని నీలాంద్రిపేట అడవుల్లో మావోయిస్టుల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
మళ్లీ కలవరం
ప్రస్తుతం మావోయిస్టుల మళ్లీ సంచరిస్తున్నట్టు ఉప్పందుకున్న పోలీసులు అడవులను జల్లెడ పడుతున్నారు. దీంతో ఆదివాసీ, గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఏజెన్సీలోని ప్రముఖ రాజకీయ నేతలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు సైతం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏజెన్సీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఏదో పని ఉందని చెప్పి బంధువుల ఇండ్లకు లేదా హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ లాంటి పట్టణాలకు చేరుకుంటున్నారు. కాంట్రాక్టర్లు సైతం పనులు పూర్తిగా నిలిపివేసి యంత్రాలను స్టేషన్‌కు తరలిస్తుంటే మరి కొందరు సమీప మైదాన ప్రాంతాల్లోని గ్రామాలకు తరలిస్తున్నారు.