టెన్షన్.. టెన్షన్.. అమరావతిలో ఉద్రిక్తత..

by srinivas |
amaravati
X

దిశ, ఏపీ బ్యూరో : రాజధాని అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రానికి అమరావతియే రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తూ అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు, ఆ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు చేస్తున్న ఆందోళనలు నేడు 600వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అమరావతి ఐకాస నేడు భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. రాజధాని నుంచి మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు ర్యాలీకి పిలుపునిచ్చింది.

అయితే ర్యాలీకి అనుమతి లేదని తుళ్లూరు పోలీసులు ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినప్పటికీ అమరావతి ఐకాస నేతలు ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కొందరు రైతులు హైకోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు రైతులకు మధ్యవాగ్వాదం చోటు చేసుకుంది. రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పోలీసులకు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో రాజేంద్ర అనే రైతుల కాలు విరిగిపోయింది.

దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే రాజధాని అమరావతి ఉద్యమానికి నేటితో 600 రోజులు పూర్తయిన సందర్భంగా అమరావతి ఐకాసకు మద్దతు తెలిపేందుకు మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు ప్రయత్నించారు. పలువురు రైతులు, మహిళా నేతలు గొల్లపూడిలోని దేవినేని ఉమా మహేశ్వరరావు ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. దీంతో గేటు లోపల నుంచే రైతులకు మద్దతుగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు రైతులు, మహిళలు ఉద్యమానికి మద్దతుగా నినాదాలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed