మైనార్టీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో టెన్షన్

by Shyam |
మైనార్టీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో టెన్షన్
X

జిల్లా మైనార్టీ శాఖకు సంబంధం లేకుండా నియమితులైన 51 ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది. అక్రమ నియామకాలకు సంబంధించి విజిలెన్స్ విచారణ పూర్తయి నివేదిక మైనార్టీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి వద్దకు చేరింది. దీనిపై ఏం చర్యలు తీసుకుంటారోననే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల్లో ఏడాది కాలంగా భర్తీ అయినా 51 మంది ఉద్యోగాలు ఉంటాయా.? ఊడుతాయా.?అనే త్రిశంకుస్వర్గంలో వేలాడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో కొంతకాలం పని చేసిన ఆర్ఎల్‌సీ రషీద్ హయంలో టీచింగ్, నాన్ టీచింగ్ 51 ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమించారు. ఎలాంటి ప్రకటన లేకుండా జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖకు సంబంధం లేకుండా అర్హులైన ఉపాధ్యాయ పోస్టు భర్తీలో డెమోలను నిర్వహించకుండానే ఉద్యోగాలను భర్తీ చేశారు. దీనిపై కొంత మంది కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ, విజిలెన్స అధికారులు విచారణ చేపట్టారు. 51 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను అంగట్లో విక్రయించారని, దీనిపై ఆర్ఎల్ సీఓ రషీద్‌ను విధుల నుంచి తప్పించారు.

బాధితుల ఉరుకులు, పరుగులు..

జిల్లాలో 18 మైనార్టీ గురుకుల సంక్షేమ పాఠశాలల్లో చేరిన 51 మంది ఉద్యోగులు తమ పోస్టింగ్ లు ఉంటాయా.. ఊడుతాయా అనే ఆందోళనలో ఉన్నారు. అధికారులకు అడిగినంత ముట్టజెప్పి పోస్టులను కొని తెచ్చుకుంటే అవి ఎప్పుడు పోతాయోనని భీతిల్లుతున్నారు. రాష్ట్ర మైనార్టీ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శికి తమ పోస్టింగ్‌లకు సంబంధించి విజిలెన్స్ విచారణ నివేదిక అందించడంతో ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని సదరు ఉద్యోగులు కంగారుపడుతున్నారు. ఏడాది తిరుగక ముందే తమను తొలగిస్తారని తెలిసిన నేపథ్యంలో వారు తమను నియామకానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, మధ్యవర్తుల వద్దకు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు.

చర్యలపై వీడని సస్పెన్స్

జిల్లా మైనార్టీ గురుకుల విద్యా సంస్థలలో 51 పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగిందని వాస్తవమేనని విజిలెన్స్ విచారణలో బహిర్గతమైంది. దీంతో శాఖపరమైన విచారణ జరిగిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియక ఇటు సంక్షేమ శాఖ, అటు గురుకుల విద్యా సంస్థల అధికారులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జిల్లాలో పలు పోస్టింగ్‌ల భర్తీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖుల సిఫారసులు బహిర్గతమయ్యాయి. కొందరైతే వారి పేరు చెప్పి నిరుద్యోగుల వద్ద ఉద్యోగాలు ఇస్తామని పెద్ద ఎత్తునా డబ్బులు వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. పెద్దల అండ ఉందని తమ ఉద్యోగాలకు ఢోకా లేదని కొందరు అంటుంటే రాష్ట్ర గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి ఎలాంటి ఆదేశాలు ఇస్తారేమోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. విచారణ జరిగిన వారం రోజులకే ఆర్‌ఎల్‌సీవోను తొలగించిన అధికారులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇంకా తొలగించక పోవడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ విషయంలో జిల్లా పాలనాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేక సతమతమవుతున్నారు. అక్రమ నియామకాల వ్యవహరంపై అధికారులు ఆచితూచి స్పందిస్తున్నారు. తమకు ఈ విషయంలో ఎలాంటి అధికారం లేదని రాష్ట్ర మైనార్టీ గురుకుల సంస్థ అధికారులే చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed