ఆసీఫ్ నగర్ సీఐపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు

by Shyam |   ( Updated:2020-06-19 09:32:11.0  )
ఆసీఫ్ నగర్ సీఐపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
X

దిశ , హైదరాబాద్: పోలీసులతో కుమ్మక్కై తనపై అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడుతున్నఇంటి యజమానిపై చర్యలు తీసుకుని, న్యాయం చేయాలని ఓ బాధితుడు శుక్రవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించాడు. వివరాల్లోకివెళితే..మహ్మద్ షఫి అనే వ్యక్తి నాంపల్లి ఫీల్ ఖాన మల్లేపల్లిలో సయ్యద్ అహ్మద్ ఉద్ధిన్‌కు చెందిన ఓ ఇంట్లో రూ.50 వేల అడ్వాన్స్ ఇచ్చి నెలకు రూ.3,500 కిరాయి చెల్లించేలా అగ్రిమెంట్ చేసుకుని 2018 నుంచి అందులో ఉంటున్నాడు. అయితే ఇంటి యజమాని అక్రమ నీటి కనెక్షన్ కలిగియున్న విషయం తెలీదు.ఈ క్రమంలోనే జలమండలి అధికారులు దాడులు జరిపి రూ.2 లక్షల పెనాల్టీ విధించారు. దీంతో తాను, మరో కిరాయిదారుడు కలిసి రూ.2 లక్షలు జరిమానా చెల్లించారు. అయితే జలమండలి అధికారులకు తాము చెల్లించిన బకాయిలు ఇవ్వాలని అడిగాడు. దీంతో ఇంటి ఓనర్ డబ్బులు ఇవ్వకపోగా, ఇల్లు ఖాళీ చేయమని బెదిరిస్తూ ఆసీఫ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 10న తనపై అక్రమంగా కేసు పెట్టాడని బాధితుడు హెచ్చార్సీ ముందు వాపోయాడు. ఓనర్ ఫిర్యాదు మేరకు ఇన్ స్పెక్టర్ తనను పలుమార్లు స్టేషన్‌కు పిలిపించి వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని బెదిరింపులకు పాల్పడ్డారని వివరించాడు. తనపై అక్రమంగా కేసు పెట్టిన ఇంటి యజమాని సయ్యద్ అహ్మద్ ఉద్ధిన్, సివిల్ తగాదాలో తలదూర్చి బెదిరింపులకు పాల్పడుతున్న ఆసీఫ్ నగర్ సీఐ పై చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని షఫీ హెచ్ఆర్సీని వేడుకున్నాడు. దీనిపై స్పందించిన హెచ్ఆర్సీ జూలై 31వ తేదీలోగా విచారణ నివేదిక అందజేయాలని పశ్చిమ మండలం డీసీపీకి ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed