ఏపీలో తెరుచుకున్న దేవాలయాలు

by srinivas |
ఏపీలో తెరుచుకున్న దేవాలయాలు
X

దిశ ఏపీ బ్యూరో: సుదీర్ఘ విరామం తరువాత ఆంధ్రప్రదేశ్‌లోని పుణ్యక్షేత్రాలన్నీ తెరుచుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో సుమారు రెండున్నర నెలల విరామం తరువాత దేవాలయాల్లోకి భక్తులను అనుమతించారు. దీంతో ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం, శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయం, విజయవాడ కనకదుర్గ గుడి, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం, సింహాచలం సింహాద్రి అప్పన్న దేవాలయంతో పాటు కడప దర్గా, విజయవాడ గుణదల చర్చి, వైజాగ్ రోస్ హిల్ చర్చ్ తదితరాలు 80 రోజుల తరువాత భక్తుల కోసం తిరిగి తెరచుకున్నాయి.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దేవాలయాధికారులు ఈ ఉదయం ప్రయోగాత్మకంగా దర్శనాలను ప్రారంభించారు. ఏళ్ల తరబడి దేవాలయాల్లో సేవలందిస్తున్న ఉద్యోగులు, స్థానికులకు ఆలయ ప్రవేశం కల్పించారు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ లను ధరించిన ఉద్యోగులు, క్యూ విధానం పాటిస్తూ ఆలయాల్లోకి ప్రవేశించారు. తిరుపతిలో దర్శనాలు తిరిగి ప్రారంభమైన శుభసందర్భాన్ని పురస్కరించుకుని స్వామివారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. పూలు, పండ్లతో ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. భక్తులకు దర్శనాలు కల్పించేందుకు మార్కింగ్ లైన్స్, భౌతిక దూరాన్ని పాటిస్తూ, నిలబడేందుకు ప్రత్యేక బాక్స్ లు, ఎక్కడికక్కడ శానిటైజర్లు ఏర్పాటు చేశారు.

మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చినవారు తిరుపతి, ఆ పరిసరాల్లో ఉన్న స్థానిక ఆలయాలను కూడా సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ సరికొత్త ఆఫర్‌తో ముందుకు వచ్చింది. వెంకటేశ్వరస్వామి దర్శనంతో పాటు ఈ ఆలయాలను దర్శించుకోవాలనుకునేవారికి ఆన్ లైన్ లో తన అధికారిక వెబ్ సైట్ (https://tirupatibalaji.ap.gov.in) ద్వారా ఉచితంగా టికెట్లు జారీచేస్తోంది. ఈ దర్శన టికెట్లను ఆలయాల వద్ద మిషన్లలోనూ తీసుకోవచ్చు. లేకపోతే, మొబైల్ ఫోన్ నుంచి 93210 33330 అనే నెంబరుకు భక్తులు దర్శించాలనుకుంటున్న ఆలయం కోడ్ తో సహా పూర్తి వివరాలు ఎస్సెమ్మెస్ చేస్తే ఫ్రీ టికెట్ పంపిస్తారు. అందుకోసం ఆలయాల కోడ్ లను కూడా వెల్లడించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం-ఎస్‌వీపీ, శ్రీనివాసం మంగాపురం శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం-ఎస్‌వీఎస్, అప్పలయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం-ఎస్‌వీఏ, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం-ఎస్‌వీజీ, తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయం-ఎస్‌వీకే.

Advertisement

Next Story

Most Viewed