- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాలుష్య కుంపటిగా డంప్ యార్డు.. కరువైన నియంత్రణ
దిశ, జహీరాబాద్: జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలోని డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు నిత్యాగ్నిహోత్రంలా మండుతూ కాలుష్య కుంపటిగా తయారైంది. రహాదారిపై నిత్యం ప్రయాణించే వారిపై విషపూరిత వాయువులను వెదజల్లుతోంది. ప్రజారోగ్యాలకు హానికరంగా మారిన వాయు కాలుష్యంపై స్థానికులు, రైతులు చేసిన ఫిర్యాదులపై నియంత్రణ కరువైందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పురపాలక సంఘం పరిధిలోని డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తా చెదారం, ఇతర వ్యర్థాలు గుట్టలు, గుట్టలుగా పడి ఉన్నాయి. దీంతో కొంత కాలంగా కాలుతున్న ఈ వ్యర్థాల నుండి దట్టమైన పొగలు వెలువడుతూ వాయు కాలుష్య ఉత్పత్తి కేంద్రంగా స్థానిక డంపింగ్ యార్డు
మారింది. వాస్తవానికి ఇళ్ల నుంచి సేకరించిన వ్యర్థాలను తడి, పొడి చెత్తగా వేరు చేయడంతోపాటు అందులోని ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను కూడా వేరు చేయాలి. ఇలా వేరు చేసిన తడి చెత్తను కంపోస్ట్ కింద మార్చాలి. కానీ స్థానికంగా ఆ పని జరగడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇక్కడి డంప్ యార్డు చెత్తలో రబ్బరు, ప్లాస్టిక్, థర్మకోల్, ఫైబర్ మొదలైన పనికిరాని వస్తువులను వేరు చేయడంలేదంటున్నారు. గత డిసెంబర్‌లో ఓ మాజీ కౌన్సిలర్ చేసిన ఫిర్యాదుపై స్పందించిన సంగారెడ్డి జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారి, అసిస్టెంట్ ఇంజనీర్ డంప్ యార్డును సందర్శించి తనిఖీ చేశారు. డంపింగ్ యార్డు పరిసరాలు, హద్దులు రాసుకున్నారు. తన సెల్‌పోన్‌తో వీడియోలు, పొటోలు తీశారు. కాలుష్య నియంత్రణ మండలి చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని, భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ ఫలితం లేకుండా పోయింది.
ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రయాణికులు
మున్సిపల్ పరిధిలోని డంపింగ్ యార్డులో చెత్త కాలుతున్న మంటలను అదుపులోకి తీసుకొని వాయు కాలుష్యం లేకుండా చూడాల్సిన అధికారులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని చేతులు దులిపేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల గల తండాలు, కాలనీలు, గ్రామాలే కాకుండా యార్డు పక్కనుంచి రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు , ఇంకోపక్క ఉన్న కస్తూరి బాయి రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల విద్యార్థులు డంపింగ్ యార్డు కాలిపోవడంతో వెలువడుతున్న దుర్వాసన పొగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు. ఈ కాలుష్యం వల్ల పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలకు రోగాలు వచ్చి , ఇబ్బందులు ఎదురై , ప్రాణ నష్టం జరుగితే ఎవరు బాద్యులని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
నోటీసు ఇచ్చాం: ఈఈ సురేష్
జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హోతి ( బి) లో గల డంప్ యార్డ్ లో పెరుగుతున్న వాయు కాలుష్య నిర్మూలనపై మున్సిపల్ కమిషనర్‌కు నోటీసులు ఇచ్చామని కాలుష్య నియంత్రణ మండలి ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సురేష్ వివరించారు. యార్డులో పెరిగిపోయిన చెత్తాచెదారాన్ని తడి, పొడి వస్తువులను వేరు చేసి మంటలు అంటకుండా చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలోనే హియరింగ్‌కు మున్సిపల్ కమిషనర్‌ను పిలుస్తామని హియరింగ్ పిలుస్తామని అన్నారు.
మున్సిపల్ కమిషనర్ :- సుభాష్ రావ్ కులకర్ణి
తడి పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియ నిరంతరం సాగుతుందని వివరించారు. ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలు నిరోధించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కాలుష్య నియంత్రణ మండలి నుంచి తమకు ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశారు.