- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేటి నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర.. ఆగిన చోటు నుంచే ప్రారంభం
దిశ, తెలంగాణ బ్యూరో: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల తన ప్రజా ప్రస్థానం పాదయాత్రను శుక్రవారం నుంచి ప్రారంభించనున్నారు. గతంలో పాదయాత్రకు బ్రేక్ పడిన చోట నుంచే తిరిగి ఈ యాత్రను ఆమె కొనసాగించనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం కొండపాక గ్రామం నుంచి ఈ యాత్రను మొదలుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో యాత్రకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పార్టీ శ్రేణులు సిద్ధం చేసినట్లు చెబుతున్నాయి. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో అనేక సమస్యలు వేధిస్తున్నాయని, నీళ్లు, నిధులు, నియామకాలు కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం అడుగడుగునా విఫలమైందని షర్మిల తన యాత్రలో ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కాగా, తిరిగి ప్రభుత్వంపై తన అస్త్రాలను ఎక్కుపెట్టేందుకు సిద్ధమయ్యారు. తన తండ్రి వైఎస్సార్ పాదయాత్ర ప్రారంభించిన చేవెళ్ల నుంచే షర్మిల సైతం 2021 అక్టోబర్ 20వ తేదీన పాదయాత్ర మొదలుపెట్టారు. ప్రజా సమస్యలు తెలుసుకుని, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పథకాల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టారు. బంగారు తెలంగాణలో ప్రజల బతుకుదెరువులు ఎలా ఉన్నాయో చూపించారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, కార్మికులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు, యువత పడుతున్నా కష్టాలను ప్రభుత్వానికి వేలెత్తి చూపారు. ఈ పాదయాత్ర ద్వారా ఇకముందు కూడా ప్రజా సమస్యలపై గళమెత్తనున్నారు.
21 రోజుల పాదయాత్ర సాగిందిలా..
చేవెళ్లలో 2021 అక్టోబర్ 20వ తేదీన బహిరంగ సభ నిర్వహించి, పాదయాత్రలో షర్మిల తన తొలిఅడుగు వేశారు. దాదాపు 21 రోజుల పాటు పాదయాత్ర కొనసాగింది. మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, కరోనా ఉధృతి దృష్ట్యా 2021 నవంబరు 9వ తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ 21 రోజులలో మొత్తం 237.4 కిలోమీటర్లు వైఎస్ షర్మిల నడిచారు. ఏడు నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది. 15 మండలాలు, 5 మున్సిపాలిటీలు, 122 గ్రామాల్లో ఆమె పర్యటించారు. ప్రజల కష్టాలను దగ్గరుండి తెలుసుకున్నారు. గ్రామాలు, పట్టణాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను గుర్తించారు. వైఎస్సార్ సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తామని ఆమె భరోసా ఇచ్చారు. ప్రజలతో దగ్గరుండి మాట్లాడి, ధైర్యం చెప్పారు. పాదయాత్రలో భాగంగా 11 మాటముచ్చట కార్యక్రమాలు, 6 పబ్లిక్ మీటింగులు షర్మిల నిర్వహించారు. నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం దీక్ష చేశారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా నవంబర్ 9వ తేదీన పాదయాత్ర తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇదిలా ఉండగా షర్మిల తన ప్రజాప్రస్థాన యాత్ర నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని కొండపాకగూడెం గ్రామం నుంచి పున:ప్రారంభించనున్నారు. పాదయాత్రలో 21వ రోజున ఆగిపోయిన గ్రామం నుంచే ఈ పాదయాత్ర తిరిగి మొదలవుతోంది. శుక్రవారం మధ్యాహ్నం 3.30గంటలకు కొండపాకగూడెం గ్రామానికి షర్మిల చేరుకుని స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారు. సాయంత్రం 4.15గంటలకు చిన్న నారాయణపురం, 5.00 గంటలకు నార్కట్ పల్లికి పాదయాత్ర చేసి చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 6.15 గంటలకు మడ ఎడవెల్లి గ్రామం మీదుగా పోతినేనిపల్లి క్రాస్‌కు చేరుకుని ప్రజల సమస్యలు తెలుసుకోనున్నారు.