యువత బీజేపీ వైపు మొగ్గుచూపుతోంది: జితేందర్ రెడ్డి

by Javid Pasha |
యువత బీజేపీ వైపు మొగ్గుచూపుతోంది: జితేందర్ రెడ్డి
X

దిశ, ఉండవెల్లి: యువత బీజేపీ వైపు మొగ్గుచూపుతోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి అన్నారు. సోమవారం అలంపూర్ చౌరస్తాలో అలంపూర్ తాలూకా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతితో కలిసి ఆయన హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అలంపూర్ నుండి ఈ నెల 14న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను బీజేపీ శ్రేణులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గోని విజయవంతం చేయాలని కోరారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఆలంపూర్ తాలూకా ఆర్డీఎస్ చివరి ఆయకట్టు వరకు నీరు అందించానని గుర్తు చేశారు.

కృష్ణ పుష్కరాల సందర్భంగా అలంపూర్‌కి వచ్చిన సీఎం కేసీఆర్ 100 కోట్లతో ఆలయాలను అభివృద్ధి చేస్తానని నేటి వరకు ఇటు తిరిగి చూడలేదని ఎద్దేవా చేశారు. దేశంలో 18 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉందన్నారు. అలంపూర్ అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు. పుల్లూర్ టోల్ ప్లాజాకు అలంపూర్ జోగులాంబ పేరు పెడతామన్నారు. యాత్రకు 22 వేల మంది యువకులు హాజరయ్యే విధంగా కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని సూచించారు.


అనంతరం బంగారు శృతి మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ మాట ఇస్తే కట్టుబడి ఉంటుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు కానీ ఆర్డీఎస్ పనుల ఆధునికీకరణ చేపట్టాలేదన్నారు. ఇంతవరకు మల్లమ్మ కుంట, వల్లూరు, జూలేకల్ రిజర్వాయర్లను నిర్మించలేదని ఎద్దేవా చేశారు. అభివృద్ధి జరగాలంటే బీజేపీ తోనే సాధ్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూనం శ్రీశైలం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి.. ఆయా మండలాల అధ్యక్షులు బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement

Next Story