వరుసగా 11వ నెల.. రెండంకెల్లోనే టోకు ద్రవ్యోల్బణం!

by Manoj |
వరుసగా 11వ నెల.. రెండంకెల్లోనే టోకు ద్రవ్యోల్బణం!
X

దిశ, వెబ్‌డెస్క్: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ (డబ్ల్యూపీఐ) ప్రస్తుత ఏడాది ఫిబ్రవరిలో వరుసగా 11వ నెలా రెండంకెల స్థాయిలో నమోదైంది. అంతకుముందు జనవరిలో 12.96 శాతంగా ఉన్న డబ్ల్యూపీఐ, గత నెల 13.11 శాతానికి పెరిగింది. గతేడాది ఇదే నెలలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 4.83 శాతంగా ఉంది. సమీక్షించిన నెలలో మెటల్, కెమికల్ ఉత్పత్తులు, ముడి చమురు, సహజ వాయువు, ఆహార, ఆహారేతర పదార్థాల ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం అధికంగా నమోదైందని ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి.

జనవరితో పోలిస్తే తయారీ ఉత్పత్తుల ధరలు అధికం కావడమే ఫిబ్రవరిలో డబ్ల్యూపీఐ పెరిగేందుకు ప్రధాన కారణం. అయితే, గత నెలాఖరు నుంచి రష్యా-ఉక్రెయిన్ మధ్య మొదలైన యుద్ధం కారణంగా అంతర్జాతీయ ముడి చమురుతో పాటు వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో రాబోయే నెలలోనూ టోకు ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిలోనే ఉంటుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఫిబ్రవరిలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 8.19 శాతంగా ఉందని, అంతకుముందు నెలలో నమోదైన 10.33 శాతం కంటే స్వల్పంగా తగ్గిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కూరగాయల ధరల ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతూ 26.93 శాతంగా ఉంది. గుడ్లు, మాంసం, చేపల ధరలు 8.14 శాతానికి పెరగ్గా, ఇంధన, విద్యుత్ ద్రవ్యోల్బణం 31.50 శాతానికి పెరిగింది. ఉత్పత్తి ఆధారిత వస్తువుల ద్రవ్యోల్బణం 9.42 శాతానికి తగ్గింది.

Advertisement

Next Story