బుల్లెట్ పై తల్లీ కూతుళ్ల కశ్మీర్ యాత్ర.. దుమ్ములేపుతున్న ఫిమేల్ బైకర్స్..

by samatah |   ( Updated:2022-05-04 08:11:30.0  )
బుల్లెట్ పై తల్లీ కూతుళ్ల కశ్మీర్ యాత్ర.. దుమ్ములేపుతున్న ఫిమేల్ బైకర్స్..
X

దిశ, ఫీచర్స్ : స్టీరియోటైప్స్ బ్రేక్ చేస్తున్న నవతరం మహిళలు ఆకాశమే హద్దుగా కెరీర్‌లో దూసుకుపోతున్నారు. క్రికెట్, బాక్సింగ్, ఫిల్మ్‌ మేకింగ్, వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ.. ఇలా ఏ రంగంలోనైనా రాణించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. లింగవివక్షను అణచివేస్తూ పురుషాధిపత్యమున్న మోటార్ బైకింగ్, రేసింగ్‌లోనూ సత్తా చాటుతూ రాబోయే యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళ ఎవరి తోడు లేకుండా యావత్ భారతాన్ని చుట్టేయగా.. 56 ఏళ్ల వయసులోనూ ఓ ధీర వనిత ఢిల్లీ నుంచి లేహ్‌‌ వరకు 18 రోజుల పాటు ఏకబిగిన ప్రయాణించి ఔరా అనిపించింది. ఇదేవిధంగా బైక్ రేసింగ్‌ అండ్‌ ర్యాలియింగ్‌లో వరల్డ్‌ టైటిల్‌ గెలుచుకున్న యువతి నుంచి బుల్లెట్‌పై కశ్మీర్ యాత్రచేసిన తల్లీకూతుళ్ల వరకు అనేక మంది మహిళలు రేసింగ్‌లో కొత్తశిఖరాలు అధిరోహిస్తున్నారు. అలాంటి ఎదురులేని మహిళా బైకర్లపై స్పెషల్ స్టోరీ..

రేసింగ్‌లో ఎదురులేని ఐశ్వర్య :

బెంగళూరుకు చెందిన ఐశ్వర్య పిస్సే 18 ఏళ్ల వయసులో బైక్ నడపడం నేర్చుకుంది. అప్సటి నుంచి తరచుగా బైక్ నడపడంతో కాన్ఫిడెన్స్ పెరిగి రేసింగ్‌లో పోటీ చేయాలనుకుంది. అయితే మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటే తప్ప మోటార్ రేసింగ్‌లో రాణించలేరు. ఏ చిన్న తప్పిదం జరిగినా జీవితాన్ని నష్టపోయే ప్రమాదముంది. కానీ ఐశ్వర్య మాత్రం రేసర్‌గా సాధించే గుర్తింపే తనకు ముఖ్యమని భావించింది. అందుకు అనుగుణంగానే రేసింగ్ పోటీల్లో ఏకంగా 9 చాంపియన్‌షిప్స్ గెలుచుకుంది. ఈ క్రమంలోనే రెండుసార్లు ఘోర ప్రమాదాలకు గురైంది. అయినా ఆ గాయాల నుంచి కోలుకుని 2019లో మోటార్‌సైకిల్‌ ర్యాలీయింగ్‌ అండ్‌ రేసింగ్‌లో పార్టిసిపేట్ చేయడమే కాక వరల్డ్‌ టైటిల్‌ సొంతం చేసుకున్న తొలి ఇండియన్ ఉమన్‌గా చరిత్ర సృష్టించింది. అంతేకాదు భారతదేశం కూడా మోటార్‌ స్పోర్ట్స్‌లో సత్తా చాటగలదని నిరూపించింది.

ఫాస్టెస్ట్ ఉమన్ రేసర్ - కళ్యాణి

మధ్యప్రదేశ్‌లోని దేవస్‌లో పుట్టి పెరిగిన 27 ఏళ్ల కల్యాణి పొటేకర్‌ తండ్రి(మోటోక్రాస్‌ రేసర్‌) స్ఫూర్తితో ఈ ఫీల్డ్‌లో అడుగుపెట్టింది. చెన్నయ్‌లోని కాలిఫోర్నియా సూపర్‌బైక్‌ స్కూల్‌లో శిక్షణ పొందిన తను 2013లో తొలిసారి 'రైడ్ ది హిమాలయ' అనే బైకింగ్‌ ఈవెంట్‌లో పాల్గొని, అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత 'ఇండియన్‌ నేషనల్‌ రేసింగ్‌ చాంపియన్‌షిప్‌' సహా‌‌ థాయ్‌లాండ్‌, తైవాన్‌లో నిర్వహించిన పోటీల్లో‌నూ పార్టిసిపేట్ చేసింది. ఇదే క్రమంలో 'బుధ్‌ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌'లో చిరుత వేగంతో బైక్ నడిపి దేశంలోనే ఫాస్టెస్ట్ బైక్ రైడర్‌గా రికార్డ్ సృష్టించింది. ఈ మేరకు మోటార్‌ స్పోర్ట్స్‌ విభాగంలో 'అవుట్‌స్టాండింగ్‌ ఉమన్‌' అవార్డ్ అందుకుంది.

56 ఏళ్ల వయసులో.. ఢిల్లీ టు లేహ్

కేరళకు చెందిన కెనరా బ్యాంక్ సీనియర్ మేనేజర్ 56 ఏళ్ల మినీ అగస్టీన్‌‌కు బైకింగ్ అంటే ప్రాణం. ఈ వయసులోనూ ఆమె ఢిల్లీ నుంచి లేహ్ వరకు బైక్‌పై ఏకబిగిన 18 రోజుల పాటు 2,400 కిలోమీటర్లు ప్రయాణించింది. అంతేకాదు 2017లో లడఖ్‌లోని 'ఖర్దుంగ్ లా' పాస్‌ చేరుకున్న అత్యంత వృద్ధ మహిళల్లో ఒకరిగా చరిత్ర సృష్టించింది. ఈ సాహస యాత్రలు చేసేందుకు అగస్టీన్ తల్లిదండ్రులు సహా భర్త ప్రోత్సాహం ఎనలేనిది. ఆమె తల్లిదండ్రులు తనను సోదరులకు దీటుగా పెంచగా.. భర్తే ఆమెకు 350 సీసీ బుల్లెట్ నడపడం నేర్పించాడు.

కాండిడా లూయిస్

మహిళా బైకింగ్ సర్క్యూట్‌లో లూయిస్‌ చాలా పాపులర్. దేశంలోని 22 రాష్ట్రాలను ఆమె ఏడు నెలల్లో పర్యటించింది. ఆ తర్వాత ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు 10 దేశాల మీదుగా దాదాపు 29,200 కిమీ దూరాన్ని బైక్ మీద ట్రావెల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటి వరకు 42 పర్యటనలకు నాయకత్వం వహించిన లూయిస్.. 2017లో DoGoodAsYouGoకు కూడా ఎంపికైంది. ఇందులో భాగంగా ఆమెరికా, కెనడాకు చెందిన మరో ముగ్గురు రైడర్స్‌తో కలిసి కంబోడియన్ అడవిలోని మారుమూల గ్రామాల పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్స్ డెలివరీ చేసి, వాటిని ఎలా ఉపయోగించాలో నేర్పించింది.

రోషిణి మిస్బా

ఢిల్లీకి చెందిన హిజాబీ బైకర్‌గా ప్రసిద్ధి చెందిన రోషిణి మిస్బా.. జీవితంలో సాధ్యమయ్యే ప్రతీ పనిని చేయాలనుకుంది. ఈ క్రమంలోనే స్పోర్ట్స్ బైక్స్‌పై ప్రత్యేక ప్రేమను పెంచుకున్న ఆమె ఇప్పటి వరకు 100కు పైగా మోటార్‌ సైకిళ్లను నడిపింది. భారతీయ వీధుల్లో అనుమతించబడిన అత్యంత వేగవంతమైన సూపర్‌బైక్స్‌లో ఒకటైన కవాసకి నింజా H2‌ సహా అరుదైన సూపర్‌ బైక్స్ కలెక్షన్స్ కలిగిఉన్న ఏకైక అమ్మాయిగా గుర్తింపు పొందింది.

తల్లీకూతుళ్ల యాత్ర :

కేరళకు చెందిన ఉపాధ్యాయురాలు అనీష.. తన భర్త కానుకగా ఇచ్చిన బుల్లెట్ బైక్‌పై కేరళ నుంచి కశ్మీర్‌ వరకు వెళ్లాలనుకుంది. అనుకున్నదే తడవుగా కూతురిని వెంటబెట్టుకుని రోజుకు 300 కిలోమీటర్ల చొప్పున కశ్మీర్‌ వరకు ప్రయాణించింది. ఈ యాత్రలో తనకు ఎదురైన అనుభవాలతో పాటు ఉమెన్ రైడర్స్ ఒంటరిగా వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రూట్ మ్యాప్‌పై అవగాహన, బస చేసేందుకు అనువైన హోటల్స్, సేఫ్టీగా వెంట తీసుకెళ్లాల్సిన వస్తువుల గురించి వివరించింది.

ఫేమస్ బైక్ రేసర్స్ :

* గురుగ్రామ్‌కు చెందిన డెంటిస్ట్ డాక్టర్ నిహారిక యాదవ్.. కేటీఎమ్ ఒపెన్ ట్రాక్ పోటీల్లో 'ఇండియాస్ ఫాస్టెస్ట్ లేడీ సూపర్ బైకర్' టైటిల్‌ సొంతం చేసుకుంది.

* కర్ణాటక బైకర్ ఈషా గుప్తా.. 2016లో బైక్‌పై ఒంటరిగా 16 రాష్ట్రాలను చుట్టేసి భారతీయ రోడ్లపై మహిళలు నిర్భయంగా ప్రయాణించవచ్చని తేల్చిచెప్పింది.

* రోష్నీ శర్మ.. 26 ఏళ్ల వయసులో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సోలోగా బైక్ రైడ్ చేసింది. ఈ మేరకు 11 రాష్ట్రాల్లోని కఠిన పర్వత శ్రేణులు దాటుకుంటూ ప్రయాణించిన మొదటి మహిళా బైకర్‌గా నిలిచింది

* డా. సారిక మెహత్.. భారత్ సహా మయన్మార్, లావోస్, నేపాల్, భూటాన్, వియత్నాం, కంబోడియా, థాయ్‌లాండ్, మలేషియా, సింగపూర్ వంటి 10 దేశాల్లో రైడ్ చేసిన తొలి భారతీయ మహిళా బైకర్‌గా నిలిచింది.

* స్టంట్ అథ్లెట్‌గా మారిన అనమ్ హషీమ్.. మహిళల బైకింగ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. 2017లో అంతర్జాతీయ స్టంట్ పోటీల్లో విజేతగా నిలిచిన ఫస్ట్ ఇండియన్.

* భారతదేశపు మొట్టమొదటి మహిళా బైకర్ల బృందాన్ని ప్రారంభించిన మహిళ ఊర్వశి పటోలే.

Advertisement

Next Story

Most Viewed